Chandrababu: రాత్రి దేవెగౌడ, కుమారస్వామిని కలిసిన చంద్రబాబు.. సోనియాగాంధీతో సమావేశానికి ఆహ్వానం

  • సోనియా గాంధీ నేతృత్వంలో రేపు బీజేపీయేతర పక్షాల సమావేశం
  • చంద్రబాబు ఆహ్వానానికి దేవెగౌడ, కుమారస్వామి సానుకూల స్పందన
  •  తాజా రాజకీయ పరిణామాలపై చర్చ

బీజేపీయేతర కూటమి ఏర్పాటులో బిజీగా ఉన్న ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మంగళవారం రాత్రి బెంగళూరులో మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామిలను కలిశారు. యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ నేతృత్వంలో రేపు (గురువారం) జరగనున్న సమావేశానికి ఆహ్వానించారు. అనంతరం తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. చంద్రబాబు ఆహ్వానానికి దేవెగౌడ, కుమారస్వామి సానుకూలంగా స్పందించారు.  

ఆదివారం వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ అన్నీ కేంద్రంలో మరోమారు బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని చెబుతున్నా బీజేపీయేతర పార్టీలు మాత్రం దానిని విశ్వసించడం లేదు. హంగ్ వస్తుందని భావిస్తున్నారు. ఇదే ధీమాతో ఉన్న చంద్రబాబు హస్తినలో తీరికలేకుండా గడుపుతున్నారు. వివిధ పార్టీల నేతలను కలుస్తూ ఫలితాల అనంతరం ఎలా వ్యవహరించాలన్నదానిపై చర్చిస్తున్నారు.  

ఆదివారం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, శరద్‌ పవార్, సీతారాం ఏచూరి తదితరులను కలిసిన చంద్రబాబు అంతకుముందు రోజు (శనివారం) లోక్‌తాంత్రిక్ జనతాదళ్ నేత శరద్ యాదవ్, ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, బీఎస్పీ అధినేత్రి మాయావతిని కలిశారు.

More Telugu News