roshan baig: అవసరమైతే బీజేపీతో చేతులు కలిపేందుకు ముస్లింలు సిద్ధంగా ఉండాలి: కాంగ్రెస్ నేత రోషన్ బేగ్

  • పరిస్థితులకు తగ్గట్టుగా ముస్లింలు మారాలి
  • ఒక్క పార్టీకే అండగా ఉండాల్సిన అవసరం లేదు
  • మమ్మల్ని అభిమానించే వారి పక్కన కూర్చునేందుకు సిద్ధం

ఎగ్జిట్ పోల్స్ ఎన్డీయేకు అనుకూలంగా వచ్చిన నేపథ్యంలో కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత రోషన్ బేగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పరిస్థితులకు తగ్గట్టుగా మారాల్సిన అవసరం ఉందనే విషయాన్ని ముస్లింలందరికీ విన్నవిస్తున్నానని... అవసరమైతే బీజేపీతో చేతులు కలిపేందుకు సిద్దంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్డీయే మళ్లీ అధికారంలోకి వస్తే పరిస్థితులను బట్టి మనం కూడా మారాల్సి ఉంటుందని అన్నారు.

ముస్లింలు కేవలం ఒక్క పార్టీకే మద్దతుగా ఉండాల్సిన అవసరం లేదని బేగ్ అన్నారు. కర్ణాటకలో ఏం జరిగిందో అందరూ గమనించాలని... ముస్లింలకు కాంగ్రెస్ కేవలం ఒక్క టికెట్ మాత్రమే ఇచ్చిందని చెప్పారు. పరిస్థితిని బట్టి కాంగ్రెస్ ను వీడేందుకు కూడా తాను సిద్ధమేనని తెలిపారు. ముస్లింలు గౌరవంతో బతుకుతారని... తమ గౌరవానికి భంగం వాటిల్లిన చోట ఉండేందుకు తాము సిద్ధంగా లేమని చెప్పారు. తమను అభిమానించే వారి పక్కన కూర్చునేందుకు తాము సిద్ధమని తెలిపారు.

కేపీసీసీ అధ్యక్షుడు దినేశ్ గుండూరావ్, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యలే కాంగ్రెస్ పరిస్థితి దిగజారడానికి కారణమని బేగ్ మండిపడ్డారు. ఎన్నికల ప్రచారాన్ని కూడా సరిగా నిర్వహించలేకపోయారని విమర్శించారు.

More Telugu News