kanakamedala: కౌంటింగ్ జరిగే ప్రాంతాల్లో వైసీపీ నేతలు దాడులకు పాల్పడే అవకాశం ఉంది: కనకమేడల

  • ఈవీఎంల కంటే ముందు వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించాలి
  • తేడాలుంటే అన్ని వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించాలి
  • 2 గంటలకు ఎన్డీయేతర పక్షాలన్నీ సమావేశమవుతాయి

ఈవీఎంలను కౌంట్ చేసిన తర్వాతే వీవీప్యాట్ స్లిప్పులను లెక్కిస్తామన్న ఈసీ వ్యాఖ్యలను టీడీపీ ఎంపీ కనకమేడల తప్పుబట్టారు. ఈవీఎంల కంటే ముందు వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలని ఈసీకి తెలియజేస్తామని ఆయన అన్నారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, కౌంటింగ్ లో తేడాలుంటే నియోజకవర్గంలోని మొత్తం వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలని డిమాండ్ చేశారు. వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించిన తర్వాతే ఫలితాలను వెల్లడించాలని ఈసీని కోరుతామని చెప్పారు. ఫారం-17సీని కూడా తప్పకుండా సరిపోల్చుకోవాలని అన్నారు. కౌంటింగ్ పారదర్శకంగా ఉండాలనేదే తమ అభిమతమని చెప్పారు.

మధ్యాహ్నం 2 గంటలకు ఎన్డీయేతర పక్షాలన్నీ సమావేశమవుతాయని తెలిపారు. కాన్స్టిట్యూషన్ క్లబ్ లో ఈ సమావేశం జరుగుతుందని చెప్పారు. ఈసీ పక్షపాత ధోరణిపై ఈ సమావేశంలో చర్చిస్తామని తెలిపారు. అనంతరం 22 పార్టీల నేతలు ఈసీని కలుస్తాయని చెప్పారు. ఫలితాలు వెల్లడయ్యేంత వరకు కౌంటింగ్ బూత్ ల నుంచి ఏజెంట్లు బయటకు రాకుండా చూడాలని అన్నారు. కౌంటింగ్ జరిగే ప్రదేశాల్లో వైసీపీ నేతలు దాడులకు పాల్పడే అవకాశం ఉందని చెప్పారు. తమపై ఫిర్యాదు చేసినవారు దాడులకు పాల్పడే అవకాశం ఉందని... టీడీపీ నేతలకు భద్రత పెంచాలని కోరారు.

More Telugu News