Kamal Nath: నేను రెడీ.. బీజేపీ డిమాండ్‌పై మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్

  • కమల్‌నాథ్ ప్రభుత్వం మైనారిటీలో పడిందని బీజేపీ ఆరోపణ
  • గవర్నర్‌ను కలిసి బల నిరూపణకు డిమాండ్
  • ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్న సీఎం

విశ్వాస పరీక్షకు తాను సిద్ధంగానే ఉన్నానని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ స్పష్టం చేశారు. కమల్‌నాథ్ సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలో పడిందని, వెంటనే విశ్వాస పరీక్ష నిర్వహించాలంటూ బీజేపీ చేసిన డిమాండ్‌పై స్పందించిన కమల్‌నాథ్ ఈ వ్యాఖ్యలు చేశారు.‘నో ప్రాబ్లెం’ అని పేర్కొన్న ఆయన విశ్వాస పరీక్షకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలో పడిందని, వెంటనే అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరిచి విశ్వాస పరీక్ష నిర్వహించాలని  కోరుతూ బీజేపీ నేత గోపాల భార్గవ గవర్నర్ ఆనందీబెన్ పటేల్‌ను కోరారు.

మధ్యప్రదేశ్‌లో బీజేపీ 29 స్థానాలు గెలుచుకుంటుందని, కాంగ్రెస్‌కు ఐదుకు మించి రావని ఆదివారం ఎగ్జిట్‌పోల్స్ వెల్లడించాయి. ఆ వెంటనే బీజేపీ నేతలు గవర్నర్‌ను కలిసి ఈ డిమాండ్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

బీజేపీ నేతల ఆరోపణలపై కమల్‌నాథ్ స్పందించారు. విశ్వాస పరీక్షకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజు నుంచీ బీజేపీ ఇవే ఆరోపణలు చేస్తోందన్నారు. గత ఐదు నెలల్లో నాలుగుసార్లు తాను మెజార్టీని నిరూపించుకున్నట్టు చెప్పారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు వారి ప్రయత్నాలు వారు చేసుకోవచ్చని కమల్‌నాథ్ ఘాటు కౌంటర్ ఇచ్చారు.  

More Telugu News