YSRCP: వైసీపీ గెలిస్తే... ఆర్థిక మంత్రి విజయసాయిరెడ్డి, స్పీకర్ గా దగ్గుబాటి లేదా అంబటి... పార్టీలో చర్చ!

  • ఎగ్జిట్ పోల్స్ తో వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతల్లో జోష్
  • ఎమ్మెల్సీని చేసి విజయసాయికి ఆర్థిక శాఖ బాధ్యతలు
  • కాబోయే మంత్రుల జాబితాలో పలువురి పేర్లు

ఆంధ్రప్రదేశ్ లో అధికార మార్పిడి జరగనుందని, వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని జాతీయ మీడియా వేసిన అంచనాలతో ఆ పార్టీ నేతలు జోష్ లో ఉన్నారు. గెలిచేది తామేనన్న భావనలో ఉన్న పార్టీ నేతల మధ్య ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. జగన్ మంత్రివర్గంలో ఎవరెవరికి స్థానం లభిస్తుందన్నదే ఈ చర్చ. కీలకమైన శాఖలు ఎవరికి దక్కనున్నాయన్న విషయంలో ఎవరికి వారు అంచనాలు వేసుకుంటూ పోతున్నారు. వైసీపీ తరఫున ఢిల్లీలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న విజయసాయిరెడ్డికి ఆర్థిక శాఖ దక్కుతుందని చర్చించుకుంటున్నారు.

చంద్రబాబునాయుడి మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా ఉన్న యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్సీ కోటాలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు విజయసాయిని కూడా ఎమ్మెల్సీని చేసి ఆర్థిక శాఖను అప్పగిస్తారని పార్టీలో చర్చ నడుస్తోంది. ఇక ఎంతో కీలకమైన స్పీకర్ పదవిని దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు ఇస్తారని, ఒకవేళ ఆయనకు కుదరకపోతే, ఆ పదవికి అంబటి రాంబాబును ఎంపిక చేయవచ్చని అంటున్నారు. స్పీకర్ గా వీరిద్దరిలో ఎవరున్నా టీడీపీని సమర్ధవంతంగా హ్యాండిల్ చేయవచ్చన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

వీరితో పాటు తనతో ఆదినుంచి ప్రయాణించిన వారికి మంత్రి పదవులు దక్కుతాయని అంచనా వేస్తున్నారు. ధర్మాన కృష్ణదాస్, అంబటి రాంబాబు, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఆర్కే రోజా, ఆళ్ల రామకృష్ణారెడ్డి, కొడాలి నాని, తదితరులకు పదవులు దక్కవచ్చని వైసీపీ నేతలు అంటున్నారు.

More Telugu News