Petrol: ఎన్నికలు ముగిశాయిగా... వరుసగా రెండో రోజూ పెరిగిన పెట్రోలు, డీజిల్ ధర!

  • ఎన్నికలు ముగియగానే వడ్డన మొదలు
  • లీటరు పెట్రోలుపై 5 పైసల పెంపు
  • 9 నుంచి 10 పైసలు పెరిగిన డీజిల్ ధర

చమురు రంగ నిపుణులు ముందుగా ఊహించినట్టుగానే, సార్వత్రిక ఎన్నికలు ముగిసి, జయాపజయాలు ఈవీఎంలలో నిక్షిప్తమై స్ట్రాంగ్ రూములకు చేరిన వెంటనే పెట్రోలు, డీజిల్ ధరల పెరుగుదల మొదలైంది. గడచిన రెండు నెలలుగా మారకుండా, దాదాపు స్థిరంగా కొనసాగుతూ వచ్చిన 'పెట్రో' ఉత్పత్తుల ధరలు ఇక పెరగనున్నాయి. ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో క్రూడాయిల్ ధరలు భారీగా పెరిగినా, ఎన్నికల వేళ ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందన్న భావనలో ఉన్న అధికార ఎన్డీయే, ధరల పెరుగుదలకు తాత్కాలిక బ్రేక్ వేసింది.

ఇక 19న ఎన్నికల ప్రక్రియ ముగియగానే, 20న పెరిగిన ధరలు, నేడు కూడా పెరిగాయి. మంగళవారం నాడు లీటరు పెట్రోల్ పై 5 పైసలు, డీజిల్ పై 9 నుంచి10 పైసల మేరకు ధరను పెంచుతున్నట్టు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ప్రకటించాయి. న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 71.17కు రూ. 66.20కి పెరిగాయి. మిగతా నగరాల్లో ధరలను పరిశీలిస్తే,  ముంబైలో పెట్రోల్ రూ. 76.78, డీజిల్ రూ. 69.36గా, కోలకతాలో పెట్రోల్  రూ. 73.24, డీజిల్ రూ. 67.96, హైదరాబాద్‌‌ లో పెట్రోల్ రూ. 75.48, డీజిల్ రూ. 71.99గా, విజయవాడలో పెట్రోల్ రూ. 74.89, డీజిల్ రూ.,71.03గా ఉన్నాయి.

 ఇదిలావుండగా, అంతర్జాతీయ మార్కెట్లో బ్యారల్ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 0.43 శాతం పెరిగి 72.28 డాలర్లకు చేరుకోగా, డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌ కు 0.46 శాతం పెరిగి, 63.50 డాలర్లుగా నమోదైంది.

More Telugu News