Srisailam: శ్రీశైల క్షేత్రంలో భారీ వర్షం... నేలకూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు!

  • ఘాట్ రోడ్డులో రాకపోకలకు అంతరాయం
  • కొబ్బరిచెట్టుపై పడిన పిడుగు
  • భక్తులకు తీవ్ర ఇబ్బందులు

ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలం, భారీ వర్షానికి వణికింది. నిన్న సాయంత్రం ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురవగా, ఆలయ పరిధిలోని పలు భారీ వృక్షాలు నేలకూలాయి. పదుల సంఖ్యలో విద్యుత్‌ స్తంభాలు పడిపోవడంతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. జగద్గురు మఠం, ఆలయ పరిపాలన భవనం, కొత్తపేట, శ్రీగిరి కాలనీల్లో చెట్లు పడిపోయాయి.

పలు దుకాణాల రేకులతో పాటు, దుకాణాల ముందు ఏర్పాటు చేసిన టెంట్లు ఈదురుగాలులకు ఎగిరిపోయాయి. ఘాట్‌ రోడ్డులో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సున్నిపెంట సమీపంలోని ఆంజనేయస్వామి దేవాలయం పక్కన ఉన్న ఓ కొబ్బరిచెట్టుపై పిడుగుపడి మంటలు వ్యాపించాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది వాటిని ఆర్పివేయడంతో ప్రమాదం తప్పింది. భారీ వర్షంలో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది.

More Telugu News