Pakistan: వరల్డ్ కప్ టీమ్ కు ఎంపిక చేయకపోవడంపై పాకిస్థాన్ బౌలర్ వింత నిరసన

  • తీవ్ర నిరాశకు గురైన జునైద్ ఖాన్
  • నిజం చేదుగా ఉంటుందంటూ ట్వీట్
  • పాకిస్థాన్ సెలక్టర్ల తీరుపై వింత నిరసన

క్రికెట్ లో పాకిస్థాన్ జట్టును అనిశ్చితికి మారుపేరుగా పేర్కొంటారు. ఎప్పుడు ఎలా ఆడుతుందో తెలియదు! ఓడిపోతుందనుకున్న మ్యాచ్ లను అసాధారణ పోరాటపటిమతో నెగ్గిన సందర్భాలున్నాయి. గెలుపు తథ్యమనుకున్న మ్యాచ్ లను తనకు మాత్రమే సాధ్యమైన రీతిలో ప్రత్యర్థికి అప్పగించిన ఘనతలు కూడా పాక్ సొంతం. ఇక పాక్ ఆటగాళ్ల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. జట్టులో అధికారికంగా ఒక్కడే కెప్టెన్ ఉన్నా, జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడు అనధికారిక కెప్టెన్ గా వ్యవహరించడం పాక్ జట్టులోనే కనిపిస్తుంది!

జట్టు ఎంపికలో ప్రతిసారి విమర్శలు వినిపించడం దాయాది దేశంలో ఆనవాయితీగా మారింది. ఇప్పుడు వరల్డ్ కప్ వేళ కూడా అదే దృశ్యం ఆవిష్కృతమైంది. ఎంతో టాలెంట్ ఉన్న ఫాస్ట్ బౌలర్ గా గుర్తింపు ఉన్న జునైద్ ఖాన్ కు ఆశ్చర్యకరమైన రీతిలో వరల్డ్ కప్ జట్టులో స్థానం దక్కలేదు. దాదాపు తెరమరుగైన స్థితిలో ఉన్న కొందరు ఆటగాళ్లు అనూహ్యంగా పాక్ జట్టులో చోటు దక్కించుకోగా, సెలక్టర్లు జునైద్ కు మొండిచేయి చూపారు.

ఈ నేపథ్యంలో జునైద్ నోటికి నల్ల ప్లాస్టర్ అంటించుకుని తన నిరసన వ్యక్తం చేశాడు. "ఈ వ్యవహారంపై నేనేమీ చెప్పాలనుకోవడంలేదు. నిజం చేదుగానే ఉంటుంది" అంటూ ట్వీట్ చేశాడు. జునైద్ పెట్టిన ఈ పోస్టుకు అభిమానుల నుంచి విశేషమైన మద్దతు లభిస్తోంది.

More Telugu News