Telangana: రేపు, ఎల్లుండి తెలుగు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు

  • 1.5 కి.మీ ఎత్తు వరకూ ఉపరితల ఆవర్తనం
  • ఒక కిలో మీటరు ఎత్తులో ఉపరితల ద్రోణి
  • తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు

ఎండలతో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. రేపు, ఎల్లుండి తెలుగు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. 1.5 కి.మీ ఎత్తు వరకూ ఉపరితల ఆవర్తనం రాయలసీమ, దక్షిణ మధ్య కర్ణాటక ప్రాంతాల్లో కొనసాగుతున్నట్టు వాతావరణశాఖ వెల్లడించింది. దక్షిణ ఛత్తీస్‌గడ్, తెలంగాణ మీదుగా ఒక కిలో మీటరు ఎత్తులో ఉపరితల ద్రోణి ఏర్పడినట్టు తెలిపింది.

వీటి ప్రభావంతోనే తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని, ఉపరితల ఆవర్తన ప్రభావం కోస్తాంధ్ర, రాయలసీమల్లోనూ కనిపించనుందని తెలిపింది. కోస్తాంధ్రలో గంటకు 30-40 కి.మీ, రాయలసీమలో 40 - 50కి.మీ వేగం గాలులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు వెల్లడించారు.

More Telugu News