lagadapati: లగడపాటీ.. నువ్వు ఫస్ట్ చేయాల్సిన సర్వే నీ కుటుంబంలో!: వైసీపీ నాయకుడు చిన్నికృష్ణ

  • దేశంలోని అన్ని సర్వేలూ జగన్ ‘సీఎం’ అన్నాయి
  • లగడపాటిది తప్పుడు సర్వే
  • వైసీపీకి ‘మినిమమ్ 110, మ్యాగ్జిమమ్ 140 సీట్లొస్తాయి

ఏపీలో టీడీపీ మళ్లీ విజయం సాధిస్తుందని ‘ఆంధ్రా ఆక్టోపస్’ లగడపాటి రాజగోపాల్ సర్వే పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ సర్వేపై వైసీపీ నాయకుడు, సినీ రచయిత చిన్నికృష్ణ విమర్శలు గుప్పించారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, దేశంలో ఉన్న అన్ని సర్వే సంస్థలు వైసీపీ అధినేత జగన్ ‘సీఎం’ అవుతారని చాలా స్పష్టంగా, నిష్పక్షపాతంగా చెప్పాయని అన్నారు. అలాంటిది, లగడపాటి సర్వే చాలా తేడాగా చెప్పిందని, తప్పుడు సర్వే ఇచ్చిందని విమర్శించారు.

‘లగడపాటీ.. నువ్వు ఫస్ట్ చేయాల్సిన సర్వే నీ కుటుంబంలో. నీ కుటుంబం పేద ప్రజలకు ఎగ్గొట్టిన డబ్బులు ఎలా తీర్చాలో ప్లాన్ చేసుకో’ అని సూచించారు. ఎల్లోమీడియాకు రివర్స్ గేర్ మొదలైందన్న విషయం లగడపాటికి తెలుసని, అసత్య వార్తలకు ఇకనైనా స్వస్తి పలకాలని హితవు పలికారు. ‘మినిమమ్ 110, మ్యాగ్జిమమ్ 140 సీట్లతో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు’ అని ధీమా వ్యక్తం చేశారు.

ఏపీలో టీడీపీకి 50 కన్నా తక్కువ అసెంబ్లీ స్థానాలు మాత్రమే వస్తాయని జోస్యం చెప్పారు. ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక  ఓట్లన్నీ తెలుగుదేశానికే పడ్డాయి కానీ, ఈవీఎంలు తప్పుగా చూపించాయని చంద్రబాబు అంటారని ఎద్దేవా చేశారు. ఈ రాష్ట్రానికి ఏం అవసరమో ప్రజలు తీర్పు ఇచ్చేశారని, జగన్ రావాలని కోరుకుంటున్నారని అభిప్రాయపడ్డారు. దేశానికి మోదీ మళ్లీ ప్రధాని కావాల్సిన అవసరం ఉందని, మోదీ అవసరమేంటో దేశ ప్రజలకు తెలుసని అన్నారు. 

More Telugu News