Andhra Pradesh: టీడీపీ గత 35 ఏళ్లుగా ఎన్నికల సర్వేలు చేయిస్తూనే ఉంది.. అలాగే ఈసారీ చేయించాం!: సీఎం చంద్రబాబు

  • ప్రతీసారి ఎన్నికల సర్వేలు వస్తూనే ఉంటాయి
  • మేం 1983 నుంచి సర్వేలు చేయిస్తూనే ఉన్నాం
  • టీడీపీ విజయానికి చాలా కారణాలు ఉన్నాయి
  • అమరావతిలో మీడియాతో టీడీపీ అధినేత

ప్రతీ ఎన్నికల సందర్భంగా సర్వేలు జరుగుతూ ఉంటాయని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. అంతిమంగా ఇప్పుడు సర్వేలు చేయించుకోవడం ఓ అలవాటుగా మారిపోయిందని వ్యాఖ్యానించారు. టీడీపీ 1983 నుంచి సర్వేలు చేస్తూనే ఉందని చెప్పారు. అంటే గత 35 ఏళ్లుగా టీడీపీ సర్వేలు చేయిస్తూనే ఉందనీ, అందులో భాగంగానే ఈసారి కూడా సర్వేలు చేయించామని వెల్లడించారు. అంతేకాకుండా ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటున్నామని పేర్కొన్నారు. ‘ఈరోజు చెబుతున్నా.. రాసుకోండి మీరు. నూటికి వెయ్యి శాతం గెలవబోయేది తెలుగుదేశం పార్టీ’ అని ధీమా వ్యక్తం చేశారు. అమరావతిలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు.

టీడీపీ గెలుస్తుందని చెప్పడానికి చాలా కారణాలు ఉన్నాయని చంద్రబాబు అన్నారు. ‘ఏప్రిల్ 11న ఈవీఎంల సమస్యలు తలెత్తడంతో నేను ఒక్క పిలుపు ఇచ్చాను. మీరు ఓటు మిస్ కావొద్దండి. వచ్చి ఓటు వేయండి అని పిలుపు ఇవ్వగానే సాయంత్రం ఆరు గంటలకల్లా పోలింగ్ కేంద్రానికి చేరుకుని మరుసటి రోజు ఉదయం 4.30 గంటల వరకూ లైన్లలో నిలబడి ఓటు వేశారు. టీడీపీ విశ్వసనీయతకు ఇంతకంటే ఉదాహరణ ఏం కావాలని అడుగుతున్నా.

టీడీపీ గెలవకుంటే జన్మభూమికి అన్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతో ఏపీ ప్రజలు భారీగా తరలి వచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ బస్సులను రద్దు చేసినా, రైళ్లలో రిజర్వేషన్ దొరక్కపోయినా ఏ వాహనం దొరికితే దానిలో ప్రజలు తరలివచ్చి ఓటు వేశారు.’ అని గుర్తుచేశారు. ‘తొలిసారి టీడీపీ చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు పట్టం కట్టారు. నేను రాజకీయాల్లో గత 40 ఏళ్లుగా ఉన్నప్పటికీ గత ఐదేళ్లలో జరిగినన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ఎప్పుడూ జరగలేదు’ అని చంద్రబాబు పునరుద్ఘాటించారు.

More Telugu News