Andhra Pradesh: టీడీపీ రావొచ్చు, వైసీపీ రావొచ్చు.. మా 30 సీట్లు మాకే ఉంటాయ్!: కేఏ పాల్

  • హెలికాప్టర్ కు ఓటేస్తే ఫ్యానుకు పడింది
  • చాలామంది ప్రజలు నాకు ఫోన్ చేసి చెప్పారు
  • ఎన్నికల్లో అమెరికా ఇంటెలిజెన్స్, రష్యన్ హ్యాకర్ల పాత్ర
  • వీడియో విడుదల చేసిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు

భారత ఎగ్జిట్ పోల్స్ తనను షాకింగ్ కు గురిచేశాయని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు. ఈ ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం)న్నీ ట్యాంపరింగ్ కు గురి అయ్యాయని ఆరోపించారు. నర్సాపురం లోక్ సభ స్థానంలో తనకు చాలా ఫిర్యాదులు వచ్చాయనీ, తాము హెలికాప్టర్ గుర్తుకు(12వ సంఖ్య)కు ఓటు వేస్తే ఫ్యాను(వైసీపీ గుర్తు- నంబర్ 2)కు పడిందని ప్రజలు ఫిర్యాదు చేశారని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో నిజం ఏమిటో దేవుడికే తెలియాలని చెప్పారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదలైన నేపథ్యంలో కేఏ పాల్ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

‘ఈ ఎలక్షన్ ఫ్రాడ్ అని నేను ముందుగానే చెప్పా. ఇప్పుడు అందరూ అదే చెబుతున్నారు. అన్ని ఓట్లు పడకపోయినా ఓ 70-80 శాతం ఓట్లు మాకే పడ్డాయి. కపిల్ సిబల్ లాంటి  వ్యక్తులు చెప్పినదాని ప్రకారం అమెరికా ఇంటెలిజెన్స్, రష్యన్ హ్యాకర్ల పాత్ర ఈ ఎన్నికల్లో ఉన్నట్లు స్పష్టమయింది. నేను ఇంకా ఇండియాలోనే ఉన్నాను. ఏపీలో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఈసీని కోరుతున్నా. అయితే ఇప్పుడు ఈసీలో ఓ కమిషనర్ అశోక్ లావాసాకు  సీఈసీ అరోరాతో అభిప్రాయభేదాలు ఉన్నాయి.

ఏపీలో ఎన్నికలు రీకాల్ చేయాలని హైకోర్టుకు వెళితే పిటిషన్ ను కొట్టేశారు. ఇక మనకు సుప్రీంకోర్టే దిక్కు. ఏదేమయినా ఏపీలో మనకు 30 ప్లస్ సీట్లు వస్తాయి. టీడీపీకి 90-100 సీట్లు వచ్చినా, లేక వైసీపీకి 90-100 సీట్లు వచ్చినా మన 30 స్థానాలు మనకే ఉంటాయి’ అని చెప్పారు. ఎగ్జిట్ పోల్స్ పై దీన్నే తన కామెంట్ గా పరిగణించాలని మీడియా ఛానల్స్ కు విజ్ఞప్తి చేశారు. గాడ్ బ్లెస్ యూ.. గుడ్ నైట్.. గుడ్ మార్నింగ్ అంటూ సందేశాన్ని ముగించారు.

More Telugu News