ISRO: అవెంజర్స్ సినిమా బడ్జెట్ కంటే తక్కువ ఖర్చుతో చంద్రుడిపైకి ఇస్రో ప్రయాణం

  • ఎండ్ గేమ్ సినిమా బడ్జెట్ రూ.2,504 కోట్లు
  • ఇస్రో చంద్రయాన్ వ్యయం రూ.1,632 కోట్లు
  • ఎంతో చవకగా జాబిల్లి యాత్ర చేస్తున్న భారత అంతరిక్ష సంస్థ

ఇటీవల ప్రపంచవ్యాప్తంగా విడుదలై వేల కోట్ల వసూళ్లతో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిన హాలీవుడ్ సైంటిఫిక్ యాక్షన్ మూవీ 'అవెంజర్స్: ఎండ్ గేమ్'. ఈ సినిమా విడుదలైన వారంరోజుల్లోనే రూ.13,000 కోట్లు వసూలు చేసి బాక్సాఫీసును దున్నేసింది. ఈ చిత్ర నిర్మాణానికి అయిన ఖర్చు కూ.2,504 కోట్లు. అయితే, ఇందులో సగం ఖర్చుతోనే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చంద్రుడిపైకి యాత్ర నిర్వహిస్తోంది.

చంద్రయాన్-1కి కొనసాగింపుగా చంద్రయాన్-2 పేరుతో ఇస్రో చేపడుతున్న ఈ రోదసి యాత్ర ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఇప్పటికే పలుదేశాలు ఎంతో ఖర్చుపెట్టి జాబిల్లిపై కాలుమోపినా, భారత్ ఎంతో చవకగా ఈ యాత్ర నిర్వహిస్తుండడమే అందరి ఆశ్చర్యానికి కారణం. చంద్రయాన్-2 కోసం ఇస్రో కేటాయించిన బడ్జెట్ కేవలం రూ.1,632 కోట్లు అంటే మన శాస్త్రవేత్తలు అధునాతన టెక్నాలజీని ఎంత చవకైన రీతిలో పొందుపరిచారో అర్థమవుతోంది. ‌

జూలై 9 నుంచి 16వ తేదీ మధ్యలో చంద్రయాన్-2 ప్రయోగానికి ఇస్రో సన్నాహాలు చేస్తోంది. తాజా చంద్రయాన్ లో భాగంగా ఇస్రో ప్రయోగించే పరికరాలు చంద్రుడి దక్షిణభాగంలో అడుగుపెట్టనున్నాయి. ఇప్పటివరకు ఏ దేశం కూడా చంద్రుడి దక్షిణభాగంలో ప్రవేశించలేదు.

More Telugu News