Andhra Pradesh: నేతల భాష అభ్యంతరకరంగా తయారైంది.. ఉచిత పథకాలకు నేను వ్యతిరేకం!: ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

  • ప్రస్తుత పరిస్థితిపై ప్రజలు, పత్రికలు సమీక్ష చేయాలి
  • కోట్లు ఖర్చు పెడుతూ నేతలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు
  • గుంటూరులో జరిగిన ఆత్మీయ సభలో వెంకయ్య వ్యాఖ్య

కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న, అమలు చేస్తున్న పథకాలపై ప్రపంచవ్యాప్తంగా చర్చ సాగుతోందని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. ప్రస్తుతం రాజకీయ నేతల భాష చాలా అభ్యంతరకరంగా తయారు అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులను చూస్తుంటే గత రాజకీయాల పట్ల తనకు సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం పరిస్థితులు చూస్తే రాజకీయాలు ఇంతలా దిగజారిపోయాయా? అని బాధ కలుగుతోందని చెప్పారు. ఐక్యరాజ్య సమితి ప్రారంభించిన శాంతి విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్న సందర్భంగా కొంతమంది మిత్రులు ఏపీలోని గుంటూరు జిల్లాలో ఏర్పాటుచేసిన ఆత్మీయ సమావేశానికి హాజరైన వెంకయ్య మాట్లాడారు.

ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ప్రజలు, ప్రభుత్వాలు సమీక్షలు చేయాలని వెంకయ్యనాయుడు సూచించారు. ‘రాజకీయ నేతలు కోట్లు ఖర్చు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. కులం, మతం, ధనం అన్నది ప్రధానం కాదు. అధికారం కోసం రాజకీయ పార్టీలు విచ్చలవిడిగా ఉచిత పథకాలు ప్రకటిస్తున్నాయి. నేను ఉచిత పథకాలకు పూర్తిగా వ్యతిరేకం. ప్రజాస్వామ్యం పటిష్టం కావాలంటే, ప్రజలకు మేలు జరగాలంటే ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలి. ప్రసంగాల స్థాయి మరింత పెరగాలి. విలువలకు పెద్ద పీట వేయాలి’ అని తెలిపారు.

More Telugu News