Andhra Pradesh: ఎన్నికల అధికారులతో టీడీపీ నేత మునిచంద్రనాయుడు వాగ్వాదం.. అరెస్ట్ చేయాలని కలెక్టర్ ఆదేశం!

  • చంద్రగిరిలోని కమ్మపల్లెలో ఈరోజు ఘటన
  • కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన పీవో
  • అరెస్ట్ చేసి రామచంద్రాపురం పీఎస్ కు తరలింపు

ఆంధ్రప్రదేశ్ లోని చంద్రగిరి నియోజకవర్గంలో ఈరోజు ఏడు చోట్ల రీపోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. దళితులను ఓట్లు వేయనివ్వలేదని వైసీపీ ఫిర్యాదు చేయడంతో ఈరోజు ఎన్ఆర్ కమ్మపల్లె, కమ్మపల్లె, పులివర్తిపల్లె, కొత్త కండ్రిగ, వెంకట్రామపురం, కాలూరు, కుప్పం బాదూరు గ్రామాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రగిరిలోని కమ్మపల్లెలో ఈరోజు ఉద్రికత్త నెలకొంది. టీడీపీ నేత మునిచంద్రనాయుడు ఈరోజు కమ్మపల్లెలో ఎన్నికల అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలింగ్ అధికారి వెంటనే కలెక్టర్ ప్రద్యుమ్నకు సమాచారం అందించారు.

టీడీపీ నేత మునిచంద్ర నాయుడు పోలింగ్ సజావుగా సాగకుండా అడ్డుకుంటున్నారని ఫిర్యాదు చేశారు. విషయాన్ని సీరియస్ గా పరిగణించిన కలెక్టర్ ప్రద్యుమ్న మునిచంద్ర నాయుడిని అరెస్ట్ చేయాలని ఆదేశించారు. రంగంలోకి దిగిన పోలీసులు మునిచంద్ర నాయుడిని అరెస్ట్ చేసి రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం ఎన్నికల అధికారులు పోలింగ్ ను నిర్వహిస్తున్నారు. ఈ ఏడు పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీగా పోలీసులను ఈసీ మోహరించింది.

More Telugu News