Manipur: మణిపూర్‌లో బీజేపీకి షాక్.. కూటమి నుంచి వైదొలిగిన ఎన్‌పీఎఫ్

  • కూటమి ధర్మాన్ని బీజేపీ విస్మరిస్తోందని ఆరోపణ
  • తమ సలహాలు, సూచనలను తీసుకోవడం లేదన్న ఎన్‌పీఎఫ్
  • ఎన్‌పీఎఫ్ మద్దతు ఉప సంహరించుకున్నా ప్రభుత్వం సేఫ్

ఎన్నికల ఫలితాల ముందు మణిపూర్‌లో బీజేపీకి షాక్ తగిలింది. బీజేపీ సారథ్యంలోని సంకీర్ణ ప్రభుత్వంలో భాగమైన  నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్‌పీఎఫ్) కూటమి నుంచి వైదొలగాలని నిర్ణయించింది. బీజేపీ కూటమి ధర్మాన్ని పక్కన పెట్టిందని, మిత్రపక్షాలను గౌరవించడం మానేసిందని ఎన్‌పీఎఫ్ ఆరోపించింది. తమ సలహాలు, సూచనలను బీజేపీ ప్రభుత్వం పెడచెవిన పెడుతోందని గత కొంతకాలంగా ఆరోపిస్తున్న ఎన్‌పీఎఫ్ చివరికి ప్రభుత్వానికి తమ మద్దతు ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది.

రాజధాని కోహిమాలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం సుదీర్ఘంగా సమావేశమైన పార్టీ నేతలు చివరికి మద్దతు ఉపసంహరించుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆ పార్టీ అధికార ప్రతినిధి అచుంబో కికోన్ తెలిపారు. కాగా, ప్రభుత్వం నుంచి ఎన్‌పీఎఫ్ తప్పుకున్నా మణిపూర్‌లోని బీజేపీ సంకీర్ణ ప్రభుత్వానికి ఇప్పటికిప్పుడు వచ్చిన నష్టం ఏమీ లేదు.

60 స్థానాలున్న శాసనసభలో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వానికి కావాలసిన మద్దతు ఉంది. బీజేపీకి 29 మంది శాసనసభ్యులు ఉండగా కూటమిలోని నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పీపీ)కి నలుగురు, ఎల్‌జేపీ, ఏఐటీసీ ఒక్కొక్క ఎమ్మెల్యే ఉన్నారు. ఓ స్వతంత్ర అభ్యర్థి మద్దతు కూడా ఉంది. కాబట్టి  ఎన్‌పీఎఫ్‌లోని నలుగురు ఎమ్మెల్యేలు తమ మద్దతు ఉపసంహరించుకున్నా ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి లేదు. కాగా, కాంగ్రెస్‌కు ఉన్న 28 మంది ఎమ్మెల్యేలలో గతేడాది 8 మంది బీజేపీ తీర్థం పుచ్చుకోవడంతో బీజేపీ ఎమ్మెల్యే సంఖ్య 29కి చేరింది.

More Telugu News