Lagadapati: 2004కి ముందు నేనేం చేశానన్నది చాలామందికి తెలియదు: లగడపాటి

  • ప్రజల నాడి తెలుసుకోవడం నా హాబీ
  • ఇప్పుడు నాకు ఏ పార్టీతో సంబంధం లేదు
  • మన మీద ఆధారపడని పార్టీ వస్తే పోరాడక తప్పదు

ప్రముఖ వ్యాపారవేత్త, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అమరావతి ప్రాంతంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో తాను పార్లమెంటు సభ్యుడ్నని, 2014 తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని చెప్పారు. సరిగ్గా చెప్పాలంటే, రెండు తెలుగు రాష్ట్రాలకు దూరంగా ఢిల్లీలో ఉంటున్నానని వివరించారు. అయితే తనకో వ్యాపకం ఉందని, ప్రజల నాడి తెలుసుకోవడం తన హాబీ అని పేర్కొన్నారు.

"చాలామందికి తెలిసిన విషయం ఏమిటంటే 2004 నుంచి నేను సర్వేలు చేస్తున్నానని అనుకుంటారు. కానీ ఎవరికీ తెలియని విషయం ఏమిటంటే 1996 నుంచి నేను ప్రజల్లో సర్వేలు చేయిస్తున్నాను. మొదట్లో కాంగ్రెస్ పార్టీలో ఉండేవాడ్ని కాబట్టి అందరికీ సర్వే ఫలితాలు చెప్పేవాణ్ని, ఇప్పుడు ఏ పార్టీతో సంబంధంలేదు" అంటూ వ్యాఖ్యలు చేశారు.

ఈసారి కేంద్రంలో ఎవరు అధికారంలోకి వస్తారన్నదానిపై రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉందని అన్నారు. మనపై ఆధారపడే ప్రభుత్వం వస్తే రాష్ట్రానికి కావాల్సినవి అడిగి సాధించుకోవచ్చని, అలాకాకుండా మనపై ఆధారపడని ప్రభుత్వం వస్తే పోరాటం చేయాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. పార్టీలైనా, ప్రభుత్వాలైనా ఇవాళ అవసరం ఉంటేనే తలొగ్గే పరిస్థితి ఉందని, అలాంటి పరిస్థితుల్లో నిరంతరం పోరాడుతూ సాధించేది పెద్దగా ఏమీ ఉండదని పెదవి విరిచారు. పోరాటాల ద్వారా ఎవరిపైనా ఒత్తిడి పెంచలేమని అన్నారు.

గతంలో 42 పార్లమెంటు స్థానాలు ఉండేవని, ఇప్పుడు ఏపీకి 25, తెలంగాణకు 17 స్థానాలుగా విడిపోయాయని తెలిపారు. దాంతో బలం క్షీణించిందని, అలాంటప్పుడు అటు అధికారపక్షం, ఇటు విపక్షం కలిసొస్తే కేంద్రంపై ఒత్తిడి పెంచి ప్రయోజనం పొందవచ్చని లగడపాటి అభిప్రాయపడ్డారు.

More Telugu News