Andhra Pradesh: గత 40 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నా.. ఈ పరిస్థితికి నేను సిగ్గుపడుతున్నా!: ఏపీ సీఎం చంద్రబాబు

  • ఎన్నికల్లో గెలుపోటములు ముఖ్యం కాదు
  • ప్రజాస్వామ్యాన్ని కాపాడటమే ముఖ్యం
  • ఢిల్లీ సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్య

డిజిటల్ కరెన్సీ ద్వారా ఎన్నికల్లో ధనప్రవాహానికి అడ్డుకట్ట వేయవచ్చని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. 2016, నవంబర్ 8న తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని చంద్రబాబు తప్పుపట్టారు. ఎన్నికల్లో గెలుపోటముల కన్నా, ప్రజాస్వామ్యాన్ని కాపాడటమే ముఖ్యమని అభిప్రాయపడ్డారు.‘భారత్ లో ఎన్నికల విధానం-జవాబుదారీతనం’ అనే అంశంపై ఢిల్లీలోని ఐఐసీలో ఈరోజు జరిగిన సదస్సుకు చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం ఎన్నికల్లో సామాన్యులు పోటీ చేసే పరిస్థితి లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

తాను గత 40 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నాననీ, ప్రస్తుత పరిస్థితికి తాను సిగ్గుపడుతున్నానని చంద్రబాబు అన్నారు. ఎన్నికల్లో ధనప్రవాహం భారీగా పెరిగిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. రూ.500, రూ.1,000 నోట్లను రద్దుచేసిన కేంద్ర ప్రభుత్వం వెంటనే రూ.2,000, రూ.500 నోట్లను తెచ్చిందని విమర్శించారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లను కూడా ఉద్యోగులు చివరివరకూ వేయడం లేదనీ, తమ డిమాండ్ కు తగ్గ డబ్బులు ఇస్తే సంబంధిత అభ్యర్థికే ఓటును ఇచ్చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

పెద్దనోట్ల రద్దు తర్వాత కమిటీకి అధ్యక్షుడిగా ఉన్న తాను కీలక సూచనలు చేశానని చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. డిజిటల్ కరెన్సీకి మళ్లాల్సిందిగా సూచించానన్నారు. కానీ ఎవ్వరూ పట్టించుకోలేదన్నారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబుతో పాటు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి లోకూర్, ఇతర ప్రముఖులు హాజరయ్యారు.

More Telugu News