వాతావరణశాఖ చల్లని కబురు.. నేడో, రేపో అండమాన్‌ను తాకనున్న నైరుతి

18-05-2019 Sat 06:19
  • అండమాన్, నికోబార్ దీవుల్లో ఇప్పటికే వర్షాలు
  • ద్రోణి ప్రభావంతో రాయలసీమలో వడగాలులు వీచే అవకాశం
  • 24 గంటల్లో చెదురుమదురు వర్షాలు
హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు చల్లని కబురు చెప్పారు. నేడు, లేదంటే రేపు నైరుతి రుతుపవనాలు అండమాన్‌ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలోకి ప్రవేశించనున్నట్టు తెలిపారు. అండమాన్‌, నికోబార్‌ దీవుల్లో ఇప్పటికే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో రాయలసీమ జిల్లాల్లో నేడు, రేపు వడగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అలాగే, రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమలలో చెదురుమదురుగా వర్షాలు పడే అవకాశం కూడా ఉందని వివరించారు. శుక్రవారం కర్నూలులో అత్యధికంగా 42.9 డిగ్రీలు, తిరుపతిలో 42.8, అనంతపురంలో 42.8, కడపలో 42.0, నెల్లూరులో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.