BJP: బీజేపీ, ఆరెస్సెస్ నేతలంతా గాడ్ లవర్స్ కాదు.. వాళ్లంతా గాడ్సే లవర్స్: రాహుల్ గాంధీ

  • గాడ్సేపై బీజేపీ నేతల ప్రశంసల వర్షం
  • ప్రజ్ఞా, హెగ్డే, నలిన్ కుమార్ ల వ్యాఖ్యలు
  • కమలనాథులపై మండిపడ్డ కాంగ్రెస్ చీఫ్

మహాత్మా గాంధీ హంతకుడు నాథూరాం గాడ్సేను బీజేపీ నేతలు అనంత్ కుమార్ హెగ్డే, నలిన్ కుమార్, ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ ప్రశంసించడంపై దేశవ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ  వ్యంగ్యంగా స్పందించారు. బీజేపీ, ఆరెస్సెస్ నేతలు గాడ్ కే లవర్స్(భగవంతుడిని ప్రేమించేవారు) కాదనీ, వారంతా గాడ్సే లవర్స్(గాడ్సేను ప్రేమించేవారు) అని ఎద్దేవా చేశారు. ఈరోజు ట్విట్టర్ లో రాహుల్ స్పందిస్తూ..‘నాకు ఎట్టకేలకు అర్థమయింది. బీజేపీ, ఆరెస్సెస్ గాడ్-కే లవర్స్ కాదు. వాళ్లంతా గాడ్-సే(గాడ్సే) లవర్స్’ అని ట్వీట్ చేశారు.

గాడ్సే నిజంగా గొప్ప దేశభక్తుడని ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ ఇటీవల వ్యాఖ్యానించారు. దీంతో అన్నివైపుల నుంచి విమర్శలు రావడంతో క్షమాపణలు కోరారు. అలాగే ఈరోజు కేంద్ర మంత్రి అనంతకుమార్ హెగ్డే స్పందిస్తూ.. గాడ్సేపై ప్రస్తుతం చర్చ జరగడం తనకు చాలా సంతోషంగా ఉందని సెలవిచ్చారు. కర్ణాటక బీజేపీ నేత నలిన్ కుమార్ కతీల్ ట్విట్టర్ లో స్పందిస్తూ..‘గాడ్సే కేవలం ఒక్కరినే చంపారనీ, కానీ రాజీవ్ గాంధీ మాత్రం 17,000 మందిని చంపారు’ అని ఆరోపించారు. అయితే ప్రజల నుంచి తీవ్రంగా వ్యతిరేకత రావడంతో తన ట్విట్టర్ హ్యాక్ కు గురయిందని హెగ్డే ప్రకటించగా, నలిన్ కుమార్ తన ట్వీట్ ను వెంటనే తొలగించారు.

More Telugu News