Andhra Pradesh: ఏపీలో చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం కాస్తా ‘చెవిరెడ్డి సెక్రటరీ’గా మారిపోయారు!: టీడీపీ నేత పంచుమర్తి అనురాధ

  • చెవిరెడ్డి అనుచరులు రైలులో మద్యం సేవించారు
  • సామాన్యులను ఇబ్బందులకు గురిచేశారు
  • ఆయనే ఇప్పుడు దళితుల గురించి మాట్లాడుతున్నారు
  • అమరావతిలో మీడియాతో ఏపీ టీడీపీ నేత

వైసీపీ నేత చెవిరెడ్డి అనుచరులు నిన్న షిర్డీకి వెళ్లే రైలులో మద్యం సేవిస్తూ సామాన్యులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని టీడీపీ నేత పంచుమర్తి అనురాధ విమర్శించారు. సామాన్య ప్రజలు భయపడేలా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధారణంగా రైల్వే బోగీలో సిగరెట్ కాలిస్తేనే రూ.500 జరిమానా విధిస్తారనీ, మరి వైసీపీ నేతలకు ఎన్ని లక్షల జరిమానా విధించాలని ప్రశ్నించారు. ఇలాంటి అనుచరులను ప్రోత్సహిస్తున్న చెవిరెడ్డి ఇప్పుడు దళితుల గురించి మాట్లాడటం హాస్యాస్పదమని విమర్శించారు. అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో అనురాధ మాట్లాడారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) ఎల్వీ సుబ్రహ్మణ్యం ప్రస్తుతం చెవిరెడ్డి సెక్రటరీగా మారిపోయారని అనురాధ ఎద్దేవా చేశారు. ఈ ఘటనను మాత్రం తాము ఊహించలేదని స్పష్టం చేశారు. చంద్రగిరిలో ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలన్న చెవిరెడ్డి ఫిర్యాదును సీఎస్ ఈసీకి పంపడంపై ఆమె ఈ మేరకు స్పందించారు. ‘సాధారణంగా ఎన్నికలు రెండు దశల్లో జరుగుతాయి. కానీ రీపోలింగ్ రెండు సార్లు జరగడం ఎప్పుడైనా చూశామా? ఇంత అరాచకమా’ అని మండిపడ్డారు. మహాత్మాగాంధీని చంపిన గాడ్సే దేశభక్తుడని బీజేపీ భోపాల్ లోక్ సభ అభ్యర్థి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ చెప్పడాన్ని తప్పుపట్టారు.

More Telugu News