America: ఇకపై ప్రతిభ ఆధారిత వలస విధానం అమలు: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌

  • 54 ఏళ్ల క్రితంనాటి అమెరికా వలస విధానంలో సంస్కరణలు
  • ప్రతిభావంతులైన ఉద్యోగుల కోటా 12 నుంచి 57 శాతానికి పెంపు
  • అమెరికా రావాలంటే ఇంగ్లీష్‌ తప్పనిసరని మెలిక

అగ్రరాజ్యం అమెరికాలో 54 ఏళ్ల క్రితం రూపొందించిన వలస విధానానికి ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంస్కరణలు చేపట్టి ఐటీ నిపుణులకు శుభవార్త చేరవేశారు. ఇకపై ప్రతిభ ఆధారిత వలస విధానాన్ని ప్రోత్సహించనున్నట్లు ప్రకటించారు. ప్రతిభావంతులైన ఉద్యోగుల కోటాను 12 శాతం నుంచి 57 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. కాకుంటే చిన్న మెలిక పెట్టారు. అమెరికా రావాలనుకునే వారికి తప్పనిసరిగా ఇంగ్లీష్‌పై పట్టుండాలని, అమెరికా సంస్కృతి, చరిత్రపై నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణులు కావాలని స్పష్టం చేశారు. ప్రస్తుత విధానం వల్ల నైపుణ్యం ఉన్న వారు అవకాశాలు కోల్పోతున్నారని, అందుకే ఈ మార్పులు చేపట్టినట్లు ప్రకటించారు. ప్రతిభావంతులకు అమెరికా తలుపులు ఎప్పుడూ తెరుచుకునే ఉంటాయని స్పష్టం చేశారు.

ప్రస్తుత విధానం వల్ల అమెరికాలో ఉంటున్న విదేశీయులను వివాహం చేసుకునే వారికి 60 శాతం, వేర్వేరు రంగాల్లో నిపుణులైన వారికి 12 శాతం కోటాతో గ్రీన్‌ కార్డు జారీ చేస్తున్నారు. హెచ్‌-1బీ వీసాతో అమెరికా వెళ్లి గ్రీన్‌ కార్డు కోసం ఎదురు చూస్తున్న వేలాది మంది భారత నిపుణులకు తాజా నిర్ణయం వల్ల మేలు జరుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

More Telugu News