Uttar Pradesh: తప్పిపోయిన బాలుడ్ని తల్లిదండ్రుల చెంతకు చేర్చిన 'ఆధార్'!

  • ఎనిమిది నెలల క్రితం సోన్‌భద్ర రైల్వే స్టేషన్‌లో తప్పిపోయిన బాలుడు
  • బాలల సంరక్షణ కేంద్రంలో చేర్చిన ఝార్ఖండ్‌  రైల్వే పోలీసులు
  • ఆధార్‌ నమోదుకు ప్రయత్నించినప్పుడు పాత కార్డు లభ్యం

ఎనిమిది నెలల క్రితం రైల్వేస్టేషన్‌లో తప్పిపోయిన బాలుడిని ఆధార్‌ కార్డు ఆధారంగా అతని తల్లిదండ్రుల వద్దకు చేర్చారు అధికారులు. వివరాల్లోకి వెళితే...గత ఏడాది సెప్టెంబరు 18న జార్ఖండ్‌కు చెందిన ఉమన్‌ అనే బాలుడు ఉత్తరప్రదేశ్‌ సోన్‌భద్ర రైల్వేస్టేషన్ లో తప్పిపోయాడు. ఏదోలా ఝార్ఖండ్‌లోని బర్‌కాకానా రైల్వేస్టేషన్‌కు చేరుకుని అక్కడ దిక్కుతోచక తిరుగుతున్న ఉమన్‌ని రైల్వే పోలీసులు గుర్తించి చేరదీశారు. వివరాలు అడిగితే చెప్పలేకపోవడంతో బాలల సంరక్షణ కేంద్రానికి అప్పగించారు. సంరక్షణ కేంద్రం అధికారులు ఆ బాలుడిని పాఠశాలలో చేర్పించేందుకు ప్రయత్నించగా ఆధార్‌ కార్డు అవసరమైంది.

దీంతో బాలుడి ఆధార్‌ కోసం బాలల సంరక్షణాధికారులు దరఖాస్తు చేశారు. నమోదు సందర్భంగా అతనికి అప్పటికే ఆధార్‌ ఉన్నట్లు వెబ్‌ సైట్‌ చూపడంతో ఉమన్‌ వేలిముద్రల ఆధారంగా పాత కార్డును గుర్తించారు. అందులో ఉన్న ఫోన్‌ నంబర్‌ ఆధారంగా  తండ్రి రాజేశ్వర్‌ను సంప్రదించారు. సమాచారం అందుకున్న బాలుడి తండ్రి హుటాహుటిన ఝార్ఖండ్‌ చేరుకుని కొడుకును కలుసుకుని ఉబ్బితబ్బిబ్బయ్యాడు. ఆధార్‌ కార్డు ఆధారంగానే బాలుడిని అతని తల్లిదండ్రుల వద్దకు చేర్చగలిగామని రామ్‌గఢ్‌ కలెక్టర్‌ రాజేశ్వరి తెలిపారు.

More Telugu News