Chittoor District: చంద్రగిరి నియోజకవర్గంలోని ఎన్‌ఆర్ కమ్మపల్లిలో ఉద్రిక్తత.. చెవిరెడ్డిని అడ్డుకున్న గ్రామస్థులు!

  • ఈ నెల 19న కమ్మపల్లిలో రీపోలింగ్
  • దళితులను పరామర్శించేందుకు వచ్చిన చెవిరెడ్డి 
  • లాఠీచార్జ్.. రేణిగుంట పోలీస్ స్టేషన్‌కు చెవిరెడ్డి తరలింపు

చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం మండలంలోని ఎన్ఆర్ కమ్మపల్లిలో గురువారం రాత్రి తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. గ్రామంలోని దళితులపై టీడీపీ నేతలు దాడులకు దిగుతున్నారని, తమకు వ్యతిరేకంగా ఓటేస్తే అంతుచూస్తామని బెదిరిస్తున్నారంటూ వైసీపీ నేతలు ఆరోపించారు. టీడీపీ దాడిలో గాయపడిన వారిని పరామర్శించేందుకంటూ వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గ్రామానికి వెళ్లారు. అయితే, తమ గ్రామంలోకి రాకుండా గ్రామస్థులు చెవిరెడ్డిని అడ్డుకున్నారు.

విషయం తెలిసిన టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని కూడా కమ్మపల్లి చేరుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. రంగంలోకి దిగిన పోలీసులు చెవిరెడ్డి, పులివర్తి నానిలను అడ్డుకోవడంతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. దీంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. చెవిరెడ్డిని రేణిగుంట పోలీస్ స్టేషన్ కు తరలించినట్టు తెలుస్తోంది. అర్బన్ ఎస్పీ ఇక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఈ నెల 19న చంద్రగిరి నియోజకవర్గంలోని ఐదు చోట్ల రీపోలింగ్ నిర్వహించనున్నారు. అందులో కమ్మపల్లి కూడా ఉంది.  

More Telugu News