Kamal Haasan: తమిళ 'బిగ్ బాస్-3' హోస్ట్ గా మళ్లీ కమలహాసనే!

  • స్టార్ విజయ్ టీవీలో బిగ్ బాస్-3 టీజర్
  • వరుసగా మూడోసారి హోస్ట్ గా కమల్ 
  • ఇంకా వెల్లడి కాని పోటీదారుల పేర్లు

రియాల్టీ షోలకే రియాల్టీ నేర్పిన కార్యక్రమం బిగ్ బాస్. ఎక్కడో నెదర్లాండ్స్ లో మొదలైన ఈ షో క్రమంగా అనేక దేశాల్లో ప్రాంతీయ భాషల్లో సైతం విస్తృత ప్రజాదరణ అందుకుంది. భారత్ లోనే పదికి పైగా సీజన్లతో ఆకట్టుకున్న బిగ్ బాస్ దక్షిణాది భాషల్లో సైతం గత రెండేళ్ల నుంచి అందరినీ అలరిస్తోంది. మరికొన్ని నెలల్లో బిగ్ బాస్ మూడో సీజన్ ప్రారంభం కానుంది. తెలుగులో దీని గురించి ఇంకా వివరాలు రాకపోయినా తమిళంలో మాత్రం బిగ్ బాస్-3 టీజర్ వీడియో వచ్చేసింది.

ఇప్పటికి రెండు సీజన్లుగా తన వాక్చాతుర్యంతో సమ్మోహితుల్ని చేస్తున్న కమలహాసన్ మరోసారి ఈ బిగ్గెస్ట్ రియాల్టీ షోకి హోస్ట్ గా వ్యవహరించనున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం కమలహాసన్ బిగ్ బాస్ షూటింగ్ లో పాల్గొంటారని తెలుస్తోంది. మక్కల్ నీది మయ్యం పార్టీ పెట్టి రాజకీయాల్లోకి దూకిన నేపథ్యంలో కమల్ బిగ్ బాస్ తో అనుబంధాన్ని కొనసాగిస్తారా? అంటూ వచ్చిన సందేహాలకు స్టార్ విజయ్ టీవీ లేటెస్ట్ టీజర్ తో అడ్డుకట్ట వేసింది. అందులో కమల్ కనిపించడంతో తాజా సీజన్ హోస్ట్ ఆయనేనని రూఢీ అయింది.

ఇక కంటెస్టెంట్లుగా ప్రియా ఆనంద్, వీజే సింధూ, రాధారవి, ప్రేమ్ జీ, సుధా చంద్రన్, లైలా మెహదీన్, చాందినీ తమిళరసన్, సాక్షి అగర్వాల్ ల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే, బిగ్ బాస్-3 పోటీదారుల విషయంలో అధికారిక సమాచారం రావాల్సి ఉంది.

More Telugu News