Uttar Pradesh: బీజేపీ పన్నిన కుట్రలో మా అభ్యర్థి ఇరుక్కున్నారు: మాయావతి

  • ఘోసి నియోజకవర్గ బీఎస్పీ ఎంపీ అభ్యర్థి అతుల్ రాయ్
  • అతుల్ పై అత్యాచార ఆరోపణల కేసు
  • అరెస్టుకు భయపడి తప్పించుకు తిరుగుతున్న అతుల్

బీజేపీపై బీఎస్పీ అధినేత్రి నిప్పులు చెరిగారు. బీజేపీ పన్నిన కుట్రలో ఘోసి నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న తమ అభ్యర్థి అతుల్ రాయ్ ఇరుకున్నారని అన్నారు. అతుల్ ను గెలిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్తపై ఉందని సూచించారు. మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక దేశంలో అల్లర్లు పెరిగిపోయాయని, పీఎం పదవికి ఆయన అర్హుడు కాదని విమర్శించారు.

బీఎస్పీని ‘బెహన్ జీకి సంపత్తీ పార్టీ’ అని మోదీ వ్యాఖ్యలు చేయడాన్ని ఆమె ఖండించారు. మోదీ తన హద్దులు మీరి మాట్లాడుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఎస్పీ అధ్యక్షురాలిగా తనకు ఉన్నదంతా ప్రజలు, అభిమానులు, తన శ్రేయోభిలాషులు ఇచ్చినవేనని, ఇందుకు సంబంధించిన సమాచారాన్ని తాను దాచిపెట్టలేదని అన్నారు. ఇతర పార్టీలను అవినీతిపరులని విమర్శిస్తున్న బీజేపీలోనే ఎక్కువ మంది అవినీతిపరులున్నారని విమర్శించారు.

ఇదిలా ఉండగా, తనపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ అతుల్ పై ఓ కాలేజీ విద్యార్థిని ఇటీవల ఫిర్యాదు చేసింది. ఈ నెల 1 నుంచి అతుల్ కనిపించకుండా పోయారు. అరెస్టు చేయకుండా తప్పించుకునేందుకు అతుల్ మలేషియాకు పారిపోయినట్టు సమాచారం. మే 23 వరకు అతుల్ అరెస్ట్ ను వాయిదా వేయాలని కోరుతూ ఆయన తరపు న్యాయవాది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అతుల్ అభ్యర్థనపై ఈ నెల 17న సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. 

More Telugu News