Telangana: ప్రస్తుతం తెలంగాణను చినజీయర్ స్వామి పరిపాలిస్తున్నారు!: ప్రొ.కంచ ఐలయ్య ఆరోపణ

  • కేసీఆర్ దళిత, బీసీ పక్షపాతినని అంటారు
  • కానీ ఒక్క అంబేద్కర్ విగ్రహానికీ నివాళులు అర్పించలేదు
  • హైదరాబాద్ లో జరిగిన సదస్సులో వ్యాఖ్య

తెలంగాణ రాష్ట్రాన్ని ప్రస్తుతం చినజీయర్ స్వామి పరిపాలిస్తున్నారని ప్రొఫెసర్ కంచ ఐలయ్య విమర్శించారు. దళిత, బీసీ పక్షపాతిని అని చెప్పుకునే తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పటివరకూ ఒక్క అంబేద్కర్ విగ్రహానికి కూడా నివాళులు అర్పించలేదని విమర్శించారు. ఇటీవల హైదరాబాద్ లో అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చేసినా కేసీఆర్ స్పందించలేదని మండిపడ్డారు. అసలు అంబేద్కర్ తో పెట్టుకున్నవాళ్లు ఎవ్వరూ బాగుపడలేదని హెచ్చరించారు. హైదరాబాద్ లో సీపీఎం ఆధ్వర్యంలో జరిగిన ‘అంబేద్కర్‌ విగ్రహం ప్రతిష్టించి, దోషులను శిక్షించడం’ అనే సదస్సులో ఐలయ్య పాల్గొన్నారు.

హైదరాబాద్ లో అంబేద్కర్ విగ్రహం కూల్చిన చోటే కొత్త విగ్రహం పెట్టాలని ఐలయ్య డిమాండ్ చేశారు. మరోవైపు అన్నిరకాల వేధింపులతో పాటు ఆర్థిక దోపిడీలకు వ్యతిరేకంగా పోరాడినప్పుడే కులవివక్ష అంతం అవుతుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అభిప్రాయపడ్డారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్దేశపూర్వకంగానే దళితులు, కమ్యూనిస్టులను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు.

More Telugu News