bjp: బీజేపీకి ఆరెస్సెస్ షాక్ ఇచ్చింది.. మోదీ చాలా ఒత్తిడిలో ఉన్నారు: మాయావతి సంచలన వ్యాఖ్యలు

  • ఒక్క హామీని కూడా బీజేపీ నెరవేర్చలేదు
  • చెడ్డపేరు వస్తుందని బీజేపీని ఆరెస్సెస్ దూరం పెట్టింది
  • ఆలయాలకు వెళ్లి ప్రార్థనలు చేయడం నాయకులకు ఫ్యాషన్ గా మారింది

ఇచ్చిన హామీల్లో ఒక్కదాన్ని కూడా బీజేపీ ప్రభుత్వం నెరవేర్చలేదని... అందుకే ఆ పార్టీకి ఆరెస్సెస్ కూడా మద్దతు విరమించుకుందని బీఎస్పీ అధినేత్రి మాయావతి అన్నారు. బీజేపీతో ఉంటే తమకు కూడా చెడ్డ పేరు వస్తుందని ఆరెస్సెస్ నేతలు భావిస్తున్నారని చెప్పారు. చివరి దశ పోలింగ్ మాత్రమే (మే 19) మిగిలి ఉన్న తరుణంలో బీజేపీపై ఈ మేరకు మాయావతి విమర్శలు గుప్పించారు.

మోదీ ఓడిపోతున్నారనే విషయం ప్రతి ఒక్కరికీ తెలుసని మాయావతి అన్నారు. ఆరెస్సెస్ కూడా ఆయనకు మద్దతు ఇవ్వడం లేదని... బీజేపీ ప్రచారంలో ఆరెస్సెస్ నేతలు, కార్యకర్తలు ఎవరూ కనిపించడం లేదని చెప్పారు. దీంతో, మోదీ చాలా ఒత్తిడికి గురవుతున్నారని అన్నారు. ఈ దేశం ఇప్పటి వరకు సేవక్, జన సేవక్, చాయ్ వాలా, చౌకీదాద్ వంటి ఎందరో నాయకులను చూసిందని... దేశ ప్రజల సంక్షేమాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించే స్వచ్ఛమైన ప్రధాని ఇప్పుడు అవసరమని చెప్పారు.

రాజకీయ నాయకులు వివిధ మతాలకు చెందిన పవిత్ర ప్రదేశాలకు వెళ్లి ప్రార్థనలు చేయడంపై మాట్లాడుతూ, ఎన్నికల్లో పోటీ చేస్తున్న నేతలు ఆలయాలకు వెళ్లి ప్రార్థనలు చేయడం ఫ్యాషన్ అయిపోయిందని మాయావతి ఎద్దేవా చేశారు. వీటికి మీడియా కూడా భారీ కవరేజ్ ఇస్తోందని... వీటిని ఈసీ నిషేధించాలని చెప్పారు. రోడ్ షోలకు భారీగా ఖర్చవుతుందని... వాటికి అయిన వ్యయాన్ని కూడా ఎన్నికల ఖర్చులో చూపించాలని అన్నారు.

More Telugu News