F-21: ఎఫ్-21 విమానయాన సంస్థ నుంచి ఇండియాకు బంపరాఫర్!

  • 1800 కోట్ల డాలర్లతో 114 విమానాల కొనుగోలుకు భారత్ ప్రయత్నం
  • విమానాలను తాము అందిస్తామంటున్న లాక్ హీడ్ మార్టిన్
  • డీల్ కుదిరితే టాటాలతో కలిసి ప్లాంట్ ఏర్పాటు
  • పోటీలో రాఫెల్, మిగ్ తదితర దిగ్గజ కంపెనీలు

అమెరికాకు చెందిన ఏరోస్పేస్ దిగ్గజం లాక్ హీడ్ మార్టిన్ భారత్ ముందు ఓ బంపరాఫర్ ను ఉంచింది. తాము తయారు చేస్తున్న అత్యాధునిక ఫైటర్ జెట్స్ ఎఫ్-21లకు కనీసం 114 ఆర్డర్ ఇస్తే, వీటిని మరే ఇతర దేశానికీ అమ్మబోమని హామీ ఇచ్చింది. ఆధునిక యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని భావిస్తున్న ఇండియా, అమెరికా, రష్యా తదితర దేశాలతో డీల్ కుదుర్చునే ప్రయత్నాలు చేస్తున్న వేళ, ఈ డీల్ పై కన్నేసిన లాక్ హీడ్ మార్టిన్, మిగతా కంపెనీలతో పోలిస్తే, ముందు నిలవాలన్న ఉద్దేశంతోనే ఈ ప్రతిపాదనను ముందుకు తెచ్చినట్టు తెలుస్తోంది.

ఎఫ్-21 యుద్ధ విమానాలను కొనుగోలు చేస్తే, ఇండియాను తమ తయారీ వ్యవస్థలోకి అనుసంధానించేందుకు సిద్ధంగా ఉన్నట్టు సంస్థ ఉపాధ్యక్షుడు వివేక్‌ లాల్‌ వ్యాఖ్యానించారు. ఇండియాతో డీల్ కుదిరితే, టాటాలతో కలసి అధునాతన కర్మాగారాన్ని ఆ దేశంలోనే ఏర్పాటు చేస్తామని వెల్లడించిన ఆయన, ఇండియాలో ఉన్న 60కిపైగా వైమానిక స్థావరాల్లో ఎక్కడి నుంచైనా ఆపరేట్ చేసేలా ఈ విమానాలుంటాయని అన్నారు.

ఇంజిన్‌, ఫైటర్, వెపన్ సిస్టమ్ తదితరాల్లో ఎన్నో మోడల్స్ కన్నా మెరుగైన పనితీరును ఇది ప్రదర్శిస్తుందని వ్యాఖ్యానించిన వివేక్ లాల్, ఇది ఎఫ్-16 బ్లాక్ 70 వేరియంట్ ను పోలి ఉంటుందన్న వ్యాఖ్యలను ఖండించారు. ఎఫ్-16 బ్లాక్ 8 వేల గంటలు ఎగురుతుందని, ఎఫ్-21 12 వేల గంటలు ఎగురుతుందని అన్నారు. గగన విహార సామర్థ్యం నుంచి మరెన్నో విషయాల్లో భారత వాతావరణానికి అనుకూలంగా ఉంటుందని తెలిపారు. దూరం నుంచి ముప్పును కనిపెట్టడంతో పాటు, 40 శాతం అధిక ఆయుధాలను తీసుకెళుతుందని తెలిపారు.

కాగా, మొత్తం 114 ఫైటర్ జెట్స్ ను కొనుగోలు చేయాలని భావిస్తున్న భారత్, 1,800 కోట్ల డాలర్ల ప్రాథమిక టెండర్ ను గత నెలలో జారీ చేసింది. ఇండియాకు విమానాలు అమ్మేందుకు లాక్ హీడ్ మార్టిన్, బోయింగ్, రాఫెల్, యూరో ఫైటర్ టైఫూన్, మిగ్, సాబ్ గ్రిఫెన్ తదితర సంస్థలు పోటీ పడుతున్నాయి. బాలాకోట్‌ దాడుల తరువాత, ఈ డీల్ ను సాధ్యమైనంత త్వరగా ఖరారు చేయాలన్న ఉద్దేశంతో ఇండియా ఉంది.

More Telugu News