Lakshman Goud: లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యండెడ్‌గా దొరికిపోయిన వేములవాడ ఆలయ అధికారి

  • భూమిని కొనుగోలు చేసిన సంపత్
  • లే అవుట్ అనుమతి కోసం రూ.8 లక్షల డిమాండ్
  • రూ.6.5 లక్షలు ఇచ్చేందుకు అంగీకారం

పెద్ద మొత్తంలో లంచం తీసుకుంటూ వేములవాడ ఆలయ అభివృద్ధి ముఖ్య ప్రణాళికాధికారి లక్ష్మణ్‌గౌడ్ అవినీతి నిరోధక శాఖకు అడ్డంగా దొరికిపోయారు. వేములవాడకు చెందిన సంపత్ రుద్రారంలో ఎనిమిది ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు. దానికి సంబంధించిన లే అవుట్ అనుమతి కోసం లక్ష్మణ్ గౌడ్‌ను ఆశ్రయించాడు. అనుమతి మంజూరు చేయాలంటే రూ.8 లక్షలు ఇవ్వాలంటూ లక్ష్మణ్‌గౌడ్ డిమాండ్ చేయగా, రూ.6.5 లక్షలు ఇచ్చేందుకు సంపత్ అంగీకరించినట్టే అంగీకరించి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.

హైదరాబాద్‌ కోఠిలోని తన నివాసానికి వచ్చి డబ్బు అందజేయాలని సంపత్‌కు లక్ష్మణ్ గౌడ్ తెలిపారు. దీంతో సంపత్ కోఠి వెళ్లి లక్ష్మణ్ గౌడ్ కుమారుడు రోహిత్‌కు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. లక్ష్మణ్‌గౌడ్‌తో పాటు ఆయన కుమారుడిని అదుపులోకి తీసుకుని, నగదును సీజ్ చేశారు. విచారణ నిమిత్తం వారిద్దరినీ వేములవాడకు తరలిస్తున్నట్టు కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ భద్రయ్య వెల్లడించారు.  

More Telugu News