KCR: ముగిసిన కేసీఆర్, స్టాలిన్ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

  • ఎన్నికల అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చ
  • అధికారం చేజిక్కించుకోవడం వలన ప్రయోజనాలు
  • మీడియాతో మాట్లాడని కేసీఆర్, స్టాలిన్

ఫెడరల్ ఫ్రంట్‌ ఏర్పాటులో భాగంగా డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ ముగిసింది. చెన్నై ఆళ్వారుపేటలోని స్టాలిన్ నివాసంలో ఇరువురి భేటీ గంటకు పైగా కొనసాగింది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. తాజా రాజకీయ పరిణామాలతో పాటు బలమైన శక్తులుగా ప్రాంతీయ పార్టీలను మలిచేందుకు అనుసరించాల్సిన వ్యూహం, ఎన్నికల అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించినట్టు సమాచారం.

ఫలితాల అనంతరం ఏర్పడబోయే కాంగ్రెస్, బీజేపీయేతర కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు పార్టీలు మద్దతివ్వడం వలన కలిగే ప్రయోజనం గురించి భేటీలో ప్రధానంగా చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్, బీజేపీలు స్పష్టమైన మెజారిటీని సాధించలేవని, ప్రాంతీయ పార్టీలే బలమైన కూటమిగా ఏర్పడి అధికారం చేజిక్కించుకోవడం వలన కలిగే ప్రయోజనాలను స్టాలిన్‌కు కేసీఆర్ వివరించినట్టు తెలుస్తోంది. ఈ భేటీ అనంతరం ఇరువురు నేతలూ మీడియాతో మాట్లాడలేదు. కేసీఆర్ హైదరాబాద్‌కు తిరిగి పయనమయ్యారు. ఈ భేటీలో టీఆర్ఎస్, డీఎంకే కీలక నేతలు వినోద్, సంతోష్ కుమార్‌, దురైమురుగన్, టీఆర్ బాలు పాల్గొన్నారు.

More Telugu News