Andhra Pradesh: టీడీపీ నేతలు భూములు, గుట్టలు కొట్టేశారు.. ఇప్పుడు కృష్ణా నదినీ వదలడం లేదు!: వైసీపీ ఆరోపణలు

  • కృష్ణా నదిలో కబ్జా స్థలం పరిశీలన
  • చంద్రబాబు, లోకేశ్, ఉమపై చర్యలకు డిమాండ్
  • అధికారంలోకి రాగానే విచారణ చేపడతామని వార్నింగ్

టీడీపీ నేతలు రాజధాని పేరుతో ప్రభుత్వ భూములు, కొండలు, గుట్టలు కొట్టేశారనీ, ఇప్పుడు కృష్ణా నదిని కూడా వదలడం లేదని వైసీపీ నేతలు మండిపడ్డారు. కృష్ణా నదిని పూడ్చివేసిన టీడీపీ నేతలు అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కబ్జా వ్యవహారం వెనుక సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేశ్‌, మంత్రి దేవినేని ఉమ తదితరుల హస్తం ఉందని ఆరోపించారు.

ఈరోజు  వైసీపీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ముస్తఫా, మర్రి రాజశేఖర్, నందిగం సురేష్, మేరుగ నాగార్జున తదితరులు కృష్ణా నదిలో కబ్జాకు గురైన ప్రాంతాన్ని సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వ భూమిని ఆక్రమించడానికి ప్రయత్నించిన చుక్కపల్లి ప్రసాద్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

ఈ వ్యవహారంలో దేవినేని ఉమ, చంద్రబాబుపై కూడా కేసు నమోదు చేయాలన్నారు. వైసీపీ అధికారంలోకి రాగానే ఈ కబ్జాపై విచారణ చేపడతామని హెచ్చరించారు. కృష్ణానది మధ్యలో కట్టడాలు చేపడుతుంటే సీఆర్‌డీఏ అధికారులు ఏం చేస్తున్నారని నిలదీశారు.

More Telugu News