Sri Lanka: శ్రీలంకలో మళ్లీ హింస.. ముస్లిం వ్యాపారస్తుల షాపులను ధ్వంసం చేసిన క్రైస్తవులు!

  • ఓ ముస్లిం వ్యాపారి చేసిన పోస్ట్ పర్యవసానం 
  • ఆగ్రహంతో రెచ్చిపోయిన క్రైస్తవులు
  • కర్ఫ్యూతో పాటు సోషల్ మీడియాపై ప్రభుత్వం నిషేధం

ఏప్రిల్ 21 ఉగ్రదాడుల అనంతరం శ్రీలంకలో టెన్షన్-టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. తాజాగా శ్రీలంకలో సోషల్ మీడియా కారణంగా కొన్ని క్రైస్తవ సంఘాలు ముస్లిం షాపులపై దాడులకు దిగి విధ్వసం సృష్టించాయి. దీంతో ఫేస్ బుక్, వాట్సాప్ పై శ్రీలంక ప్రభుత్వం నిషేధం విధించింది. అల్లర్లు వ్యాపించిన ప్రాంతాల్లో కర్ఫ్యూ ప్రకటించింది. శ్రీలంక లోని ఛిలా పట్టణానికి చెందిన ఓ ముస్లిం వ్యాపారి ‘ఇంకా నవ్వకండి.. ఏదో ఒకరోజు మీరు ఏడుస్తారు’ అని ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు.

అయితే ఇది క్రైస్తవులను ఉద్దేశించి చేశారనీ, మళ్లీ ఉగ్రదాడి జరగబోతోందని సోషల్ మీడియాలో కొందరు క్రైస్తవులు భావించారు. వెంటనే కొన్ని క్రైస్తవ సంఘాలు ముస్లిం వ్యాపారస్తుల షాపులే లక్ష్యంగా విధ్వంసానికి దిగాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, సైన్యం గాల్లోకి కాల్పులు జరిపి ఆందోళనకారులను చెదరగొట్టారు. పరిస్థితులు అదుపు తప్పకుండా కర్ఫ్యూ విధించారు.

ఈ నేపథ్యంలో శాంతి భద్రతలు మరింతగా దిగజారకుండా ఫేస్ బుక్, వాట్సాప్ లపై నిషేధం విధించారు. శ్రీలంకలో గత నెల 21న ఈస్టర్ పర్వదినం సందర్భంగా చర్చిలు, హోటళ్లు లక్ష్యంగా నేషనల్ తౌహీద్ జమాత్ ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడిచేశారు. ఈ దుర్ఘటనలో 258 మంది చనిపోగా, 500 మందికి పైగా గాయపడ్డారు. దీంతో అప్పటి నుంచి దేశంలో అత్యవసర పరిస్థితి కొనసాగుతోంది.

More Telugu News