AP cbinet: ఏపీ కేబినెట్‌ మీటింగ్‌ జరిగేనా?...సీఈసీ నుంచి ఇప్పటికీ రాని అనుమతి

  • షెడ్యూల్‌ ప్రకారం రేపు జరగాల్సి ఉన్న భేటీ
  • ఎజెండాను ఎన్నికల సంఘానికి పంపిన సీఎస్‌
  • ఈరోజు సాయంత్రంలోగా అనుమతి వస్తేనే అవకాశం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కేబినెట్‌ సమావేశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. అమరావతిలో రేపు జరగాల్సి ఉన్న సమావేశం అసలు జరుగుతుందా? లేదా? అన్న సందేహాలు ముసురుకుంటున్నాయి. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందున కేబినెట్‌ భేటీకి ఎన్నికల సంఘం అనుమతి తప్పనిసరి.

దీన్ని దృష్టిలో పెట్టుకుని కేబినెట్‌ భేటీ నిర్వహణకు అనుమతి కోరుతూ సమావేశం ఎజెండాను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌.వి.సుబ్రహ్మణ్యం నేతృత్వంలోని స్క్రీనింగ్‌ కమిటీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి పంపారు. ఆయన దాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపారు. దీనిపై నిన్న సాయంత్రంలోగా స్పందించాల్సిన ఎన్నికల సంఘం ఇప్పటి వరకు స్పందించలేదు. దీంతో సమావేశంపై ఉత్కంఠ నెలకొంది.

ఓ వైపు సమావేశాన్ని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తుండడం, మరోవైపు ఎన్నికల సంఘం నుంచి అనుమతి లేకపోవడంతో అసలేం జరగబోతోంది? అన్న చర్చ సాగుతోంది. నిబంధనల ప్రకారం ఈరోజు సాయంత్రంలోగా అనుమతి వస్తేనే రేపటి సమావేశం జరిగే అవకాశం ఉంది.

ఆరో విడత ఎన్నికల పోలింగ్‌ ఆదివారం జరగడంతో ఎన్నికల సంఘం అధికారులు బిజీగా ఉంటారని, అందువల్ల ఈరోజు మధ్యాహ్నానికి అనుమతి వచ్చే అవకాశం ఉందని సీఎస్‌ కార్యాలయం వర్గాల భోగట్టా. కాగా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ కావాలని సీఎస్‌ ఎల్‌.వి.సుబ్రహ్మణ్యం నిర్ణయించారు.

More Telugu News