Kamal Haasan: స్వతంత్ర భారతావనిలో తొలి టెర్రరిస్ట్ హిందువే!: కమలహాసన్ వివాదాస్పద వ్యాఖ్యలు

  • జాతిపితను హత్య చేసిన గాడ్సే తొలి ఉగ్రవాది
  • ప్రజల మధ్య విభేదాలు తెస్తున్న బీజేపీ
  • అరవకురిచ్చి ప్రచారంలో కమల్ ఆరోపణలు 

స్వతంత్ర భారతావనిలో తొలి ఉగ్రవాది ఓ హిందువేనని తమిళ రాజకీయ నేత, నటుడు కమలహాసన్ అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గాంధీని దారుణంగా కాల్చి చంపిన నాధూరాం గాడ్సే, హిందూ మహాసభ నేతేనని, ఇండియాకు స్వాతంత్ర్యం వచ్చిన తరువాత తొలి టెర్రరిస్ట్ అతనేనని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా, ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉండే కరూర్ జిల్లా అరవకురిచ్చి అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించిన ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

'హిందుత్వ తీవ్రవాదం' అన్న పదాన్ని వాడినందుకు తనను ఎంతో మంది విమర్శించారని, ఏ మతమైనా ప్రేమ, అహింసలను మాత్రమే బోధించిందని ఈ సందర్భంగా కమల్ అన్నారు. హిందూ మతమైనా, ఇస్లాం మతమైనా హింసను ప్రోత్సహించదని, ఖురాన్ ను నమ్మేవారెవరూ ఉగ్రవాదులు కాలేరని అన్నారు. కేంద్రంలోని బీజేపీ, ప్రజల మధ్య మతపరమైన విభేదాలను తీసుకురావడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కాగా, అరవకురిచ్చి అసెంబ్లీకి ఈ నెల 19న ఉప ఎన్నికలు జరగనుండగా, కమల్ తన అభ్యర్థిగా మోహన్ రాజ్ అనే వ్యక్తిని నిలిపారు.

More Telugu News