Tamil Nadu: కోయంబత్తూరు విమానాశ్రయంపై లేజర్ కిరణాలు.. ఉగ్రవాదుల కుట్రగా అనుమానం

  • కోవై విమానాశ్రయంపై రాత్రివేళ లేజర్ కిరణాలు
  • నిఘా వర్గాల హెచ్చరిక నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం
  • సుదూరం నుంచి శక్తిమంతమైన టార్చి ద్వారా వేస్తున్నట్టు గుర్తింపు

తమిళనాడు కోయంబత్తూరులోని విమానాశ్రయంపై లేజర్ కిరణాలు ప్రసరించడం కలకలం రేపుతోంది. రాత్రివేళ అప్పుడప్పుడు లేజర్ కిరణాలు ప్రసరిస్తుండడంతో ఉగ్రవాదుల కుట్రగా పోలీసులు అనుమానిస్తున్నారు. భారత్‌లోనూ శ్రీలంక తరహా దాడులు జరిగే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికలతో భద్రతను కట్టుదిట్టం చేసిన పోలీసులు నగరంలో ముమ్మర తనిఖీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో విమానాశ్రయంపై లేజర్ కిరణాలు ప్రసరించడంతో సీఐఎస్ఎఫ్ బలగాలు అప్రమత్తమయ్యాయి. వెంటనే సూళూరు పోలీసులకు సమాచారం అందించాయి.

విమానాశ్రయానికి చేరుకున్న పోలీసులు సమీప ప్రాంతాలను పరిశీలించారు. చుట్టుపక్కల హోటళ్ల నుంచి ఇవి రాలేదని, చాలా దూరం నుంచి శక్తిమంతమైన టార్చిలైట్ ద్వారా వీటిని వేస్తున్నట్టు నిర్ధారించారు. దీంతో అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? వీటి వెనక ఎవరు ఉన్నారు? ఉగ్రవాదుల కుట్ర ఏమైనా ఉందా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

More Telugu News