West Bengal: బీజేపీ మద్దతుదారులు కేంద్ర సాయుధ బలగాల దుస్తుల్లో వచ్చారు: మమతా బెనర్జీ ఫైర్

  • సాయుధ బలగాల ముసుగులో ఆర్ఎస్ఎస్ వాదులను పంపారు
  • భద్రతా సిబ్బంది మోదీకి ఓటేయమని ప్రజలను కోరుతున్నారు
  • ఇలా అడగడం పట్ల సిగ్గుపడాలి

పశ్చిమ బెంగాల్ లో ఇవాళ ఆరో విడత పోలింగ్ సందర్భంగా అత్యధిక ఓటింగ్ శాతం నమోదైన సంగతి తెలిసిందే. అయితే, ఇక్కడి ఓటర్లను ప్రభావితం చేసేందుకు బీజేపీ, దాని మాతృసంస్థ అయిన ఆర్ఎస్ఎస్ మద్దతుదారులు కేంద్ర సాయుధ బలగాల దుస్తుల్లో వచ్చారంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శించారు.

"కేంద్ర బలగాలను అగౌరవపర్చాలన్నది నా ఉద్దేశం కాదు. కానీ, ఇక్కడికి భద్రత విధుల నిమిత్తమై వచ్చినవాళ్లలో అత్యధికులు సాయుధ బలగాల ముసుగులో ఉన్న ఆర్ఎస్ఎస్ వాదులే" అని స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వీళ్లు అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద చేరి, ఆపై కాషాయపార్టీకి ఓటేయమంటూ ప్రజలను కోరుతున్నారని మండిపడ్డారు. బీజేపీకి ఓట్లు వేయించడం కేంద్ర భద్రత బలగాల బాధ్యతా? అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. మోదీకి ఓటేయమని చెప్పడం పట్ల కేంద్ర బలగాలు సిగ్గుపడాలని అన్నారు.

ఇవాళ మోదీ నేతృత్వంలో పనిచేస్తారు బాగానే ఉంది, మరి రేపు మరొకరి నాయకత్వంలో పనిచేయాల్సి ఉంటుంది. అప్పుడేం చేస్తారు? అంటూ మమతా తీవ్రస్వరంతో ప్రశ్నించారు. బెంగాల్ లో పోలింగ్ నిర్వహణకు కొందరు రిటైర్డ్ అధికారులను ఉపయోగించుకుంటున్న మోదీ ప్రభుత్వం, తామనుకున్న విధంగా చేస్తోందని మండిపడ్డారు.

More Telugu News