janasena: మార్పు మొదలైంది.. అది అసెంబ్లీలో కనబడుతుంది: పవన్ కల్యాణ్

  • ఓట‌మి-ఫ‌లితం అనే భ‌యాలు లేవు
  • మార్పు కోసం ఎంత పోరాడమన్న ఆలోచ‌నే చేస్తా
  • ‘జనసేన’ అభ్యర్ధుల‌తో ముఖాముఖిలో ప‌వ‌న్‌ క‌ల్యాణ్

'మార్పు మొద‌లైంది... అది అసెంబ్లీలో క‌న‌బ‌డుతుంది.. ఎంత? ఏంటి? అనే సంగ‌తి ప‌క్క‌న‌పెడితే జ‌న‌సేన పార్టీ బ‌లాన్ని త‌క్కువ‌గా అంచ‌నా వేయొద్ద'ని జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్‌ క‌ల్యాణ్ స్పష్టం చేశారు. ‘జ‌న‌సేన బ‌లం తెలియ‌దు’ అన్న ప‌దం ఎవ‌రూ మాట్లాడ‌వ‌ద్ద‌ని, కొన్ని ల‌క్ష‌ల మంది యువ‌త వెంట ఉన్నార‌ని అన్నారు. మీడియా, మందీ మార్బలం లేకుండా.. ఇంతమంది ఎన్ని కోట్లు ఇస్తే వ‌స్తార‌ని ప్ర‌శ్నించారు. గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరిలోని ‘జ‌న‌సేన’ కార్యాల‌యంలో పార్టీ త‌రఫున పోటీ చేసిన ఎమ్మెల్యే, ఎంపీ అభ్య‌ర్థుల‌తో ముఖాముఖి స‌మావేశం నిర్వ‌హించారు. రెండో విడ‌త జ‌రిగిన ఈ స‌మావేశంలో పాల్గొన్న అభ్య‌ర్థులు త‌మ‌ని తాము ప‌రిచ‌యం చేసుకుని, ఎల‌క్ష‌నీరింగ్‌లో ఎదురైన అనుభ‌వాల‌ను పంచుకున్నారు.అనంత‌రం అభ్య‌ర్ధుల‌ను ఉద్దేశించి ప‌వ‌న్‌ క‌ల్యాణ్ మాట్లాడుతూ, ‘పీఆర్పీ స‌మ‌యంలో అంతా ఆశ‌తో వ‌చ్చారు, ఆశ‌యంతో ఎవ‌రూ రాలేదు. జ‌న‌సేన పార్టీ మాత్రం ఆశ‌యాల‌తో ముందుకు వెళ్తుంది. నాకు ఓట‌మి భ‌యం లేదు, ఫ‌లితం ఎలా ఉంటుందనే భ‌యం లేదు. ఎన్ని సీట్లు వ‌స్తాయన్న అంశం మీద దృష్టి పెట్ట‌లేదు. ఎంత పోరాటం చేశామ‌న్న అంశం మీదే నా ఆలోచ‌న‌. మార్పు కోసం మ‌హిళ‌లు చాలా బ‌లంగా నిల‌బ‌డ్డారు. గెలుస్తారా.?  లేదా? అన్న అంశం ప‌క్క‌న‌పెట్టి భ‌య‌ప‌డ‌కుండా వ‌చ్చి ఓట్లు వేశారు’ అని అన్నారు. ఎన్ని సీట్లు గెలిచామ‌న్న దానికంటే, ఎంత శాతం ఓటింగ్ వ‌చ్చింది అన్న‌ది, ఎంత మందిని మార్పు దిశ‌గా క‌దిలించామ‌న్న‌దే ముఖ్యం. ముందుగా ఓట్లు వేసిన వేలాది మందిని గౌర‌వించండి. ఎంత బాగా పోరాడాం అన్న అంశం మీద ఆలోచ‌న చేయండి. ‘మార్పు’ మొద‌లైంది. అది మ‌న గెలుపు. ‘మార్పు’ అన్న‌ది గొప్ప అంశం, ఎమ్మెల్యే అన్న‌ది చిన్న అంశం అని గుర్తుపెట్టుకోండి’ అని అన్నారు. స్థానిక స‌మ‌స్య‌లు, స్థానిక ఎన్నిక‌లపై దృష్టి సారించాలని ఈ సందర్బంగా పవన్ కల్యాణ్ సూచించారు.

More Telugu News