Andhra Pradesh: చంద్రబాబు హయాంలో ఏపీలో మద్యం డోర్ డెలివరీ జరుగుతోంది!: లక్ష్మీపార్వతి

  • ఎన్టీఆర్ అప్పట్లో మద్య నిషేధం అమలుచేశారు
  • దీంతో రాష్ట్రంలోని మహిళలు అంతా సంతోషించారు
  • అనంతపురంలో కనీసం తాగునీరు దొరకడం లేదు

టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ అప్పట్లో సంపూర్ణ మధ్యపాన నిషేధం అమలుచేస్తే మహిళలు అంతా సంతోషించారని లక్ష్మీపార్వతి తెలిపారు. కానీ టీడీపీ ప్రభుత్వ హయాంలో మద్యం డోర్ డెలివరీ స్థాయికి చేరుకుందని విమర్శించారు. ఓవైపు అనంతపురం జిల్లాలో ప్రజలు తాగునీరు లేకుండా అల్లాడిపోతుంటే, మరోవైపు జిల్లాలో మద్యం అమ్మకాలతో టీడీపీ ప్రభుత్వానికి రూ.244 కోట్ల ఆదాయం చేకూరిందని వ్యాఖ్యానించారు.

ఏపీలోని గుంటూరులో జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో ఈరోజు మద్యపాన నిషేధంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. మద్యం అమ్మకాల ద్వారా మంచినీటి వసతిని ఏర్పాటుచేయాల్సిన చంద్రబాబు ప్రభుత్వం ఆ మొత్తాన్ని ఖజానాలో వేసుకుందని దుయ్యబట్టారు.

ప్రస్తుతం ఏపీలో చిన్నపిల్లలు కూడా మద్యానికి బానిస అవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లిదండ్రులంతా పిల్లలను ఓ కంట గమనిస్తూ ఉండాలని లక్ష్మీపార్వతి సూచించారు. అందరూ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే సంపూర్ణ మద్య నిషేధం సాధ్యమేనని అభిప్రాయపడ్డారు.

More Telugu News