West Bengal: బీజేపీ అభ్యర్థి భారతీ ఘోష్ కు చేదు అనుభవం.. కన్నీరు పెట్టుకున్న మహిళా నేత!

  • ఘటాల్ లో పోటీచేస్తున్న భారతీఘోష్
  • ఆమెపై దాడికి ప్రయత్నించిన టీఎంసీ శ్రేణులు
  • మనస్తాపంతో కంటతడి పెట్టుకున్న బీజేపీ నేత

సార్వత్రిక ఎన్నికల ఆరో విడత పోలింగ్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా సాగుతుంది. ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, ఢిల్లీ, హరియాణా సహా ఏడు రాష్ట్రాల్లోని 59 స్థానాలకు ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పశ్చిమబెంగాల్ లోని ఘటాల్ నియోజకవర్గంలో బీజేపీ నేత, మాజీ ఐపీఎస్ అధికారిణి  భారతీ ఘోష్ కు చేదు అనుభవం ఎదురయింది. ఎన్నికల సరళిని పరిశీలించేందుకు నియోజకవర్గంలోని ఓ పోలింగ్ కేంద్రానికి వెళ్లిన ఘోష్ పై కొందరు తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) కార్యకర్తలు దాడికి ప్రయత్నించారు.

దూషిస్తూ అక్కడి నుంచి వెళ్లిపోవాలనీ, ఆమెను పోలింగ్ కేంద్రంలోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఘోష్ చుట్టూ రక్షణగా నిలబడి ఆమెను అక్కడి నుంచి పంపించివేశారు. ఈ సందర్భంగా ఆమె కారును కూడా ఆందోళనకారులు ధ్వంసం చేశారు. దీంతో అక్కడి నుంచి మరో పోలింగ్ కేంద్రానికి వెళ్లగా భారతీ ఘోష్ కు అదే అనుభవం ఎదురయింది.

అక్కడ కూడా టీఎంసీ మహిళా కార్యకర్తలు ఆమెపై దాడి చేసేందుకు దూసుకొచ్చారు. దీంతో భారతీ ఘోష్ కన్నీరుపెట్టుకున్నారు. గతంలో టీఎంసీలో కొనసాగిన భారతీ ఘోష్, ఇటీవల బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆమెకు బీజేపీ అధిష్టానం ఘటాల్ లోక్ సభ సీటును కేటాయించింది.

More Telugu News