modi: నాపై నిలువెల్లా ద్వేషాన్ని నింపుకున్నారు.. ఆయనలో భయం కనిపిస్తోంది: మోదీపై రాహుల్ ఫైర్

  • నాతో మాట్లాడటానికి కూడా ఆయన ఇష్టపడరు
  • మోదీ గెలుస్తారని ఇప్పుడు ఎవరూ చెప్పడం లేదు
  • దేశాన్ని గుప్పిట్లో ఉంచుకోవడానికి ఒక శక్తి పని చేస్తోంది

ప్రధాని మోదీ తనపై నిలువెల్లా ద్వేషాన్ని నింపుకున్నారని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అన్నారు. ప్రేమాభిమానాలతో నిండిపోయిన ఈ దేశంలో... ఆయన మాత్రం వ్యక్తిగత ద్వేషంతో నిండిపోయారని విమర్శించారు. పబ్లిక్ ఫంక్షన్లలో మోదీని తాను ఎంతో అభిమానంతో కలుస్తానని, ఎంతో గౌరవంతో మాట్లాడతానని... ఆయన మాత్రం తనతో మాట్లాడటానికి కూడా ఇష్టపడరని అన్నారు. కేవలం ప్రసంగించడం, కామెంట్లు చేయడం మాత్రమే ప్రధాని బాధ్యత అనే విధంగా మోదీ తీరు ఉంటుందని... దేశ భవిష్యత్తు కోసం వ్యూహాత్మకంగా ఆయన వ్యవహరించరని దుయ్యబట్టారు. దేశ ఆర్థిక స్థితిని మన్మోహన్ సింగ్ ఎంతో వ్యూహాత్మకంగా మెరుగు పరిచారని అన్నారు.

దేశంలో ఏక పార్టీ (బీజేపీ) పాలన రావాలని కోరుకుంటున్న ఆర్ఎస్ఎస్ కు వ్యతిరేకంగా తాము పోరాడుతున్నామని రాహుల్ తెలిపారు. బీజేపీ-ఆరెస్సెస్ కు, దేశ ప్రగతిని కోరుకుంటున్న పార్టీల కూటమికి మధ్య పోరు జరుగుతోందని అన్నారు. ప్రజల్లో భయాందోళనలు పెరిగిపోయాయని... తాను ఎక్కడకు వెళ్లినా ఆ విషయం తనకు స్పష్టంగా తెలుస్తోందని చెప్పారు. యావత్ దేశాన్ని గుప్పిట్లో ఉంచుకోవడానికి ఒక శక్తి పని చేస్తోందని అన్నారు.

మోదీని ఎవరూ ఎదిరించలేరని ఐదేళ్ల క్రితం కొందరు అన్నారని... పార్లమెంటు లోపల, వెలుపల మోదీపై తాము పోరాటం చేశామని రాహుల్ తెలిపారు. ఇప్పుడు మోదీలో భయం కనిపిస్తోందని చెప్పారు. మోదీ గెలుస్తారని ఇప్పుడు ఎవరూ చెప్పడం లేదని అన్నారు. ఎవరి సూచనలు పట్టించుకోకుండా దేశాన్ని పాలిస్తే... ఆ దేశం ఎప్పటికీ సక్రమంగా కార్యకలాపాలను సాగించలేదని చెప్పారు. ప్రజల అభిప్రాయం మేరకే తాను ముందుకు సాగుతానని అన్నారు. కాంగ్రెస్ గెలిస్తే ప్రధాని ఎవరనే ప్రశ్నకు మే 23వ తేదీ తర్వాతే సమాధానం చెబుతానని తెలిపారు. రాజ్యాంగానికి విఘాతం కలిగిస్తున్న శక్తులపై తాము పోరాడుతున్నామని చెప్పారు. ఆర్బీఐ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండానే పెద్ద నోట్లను మోదీ రద్దు చేశారని విమర్శించారు.

More Telugu News