Andhra Pradesh: సాక్షి పేపర్, ఛానల్ పై మండిపడ్డ మెగాబ్రదర్ నాగబాబు!

  • చంద్రబాబు, జగన్ లను కల్యాణ్ విమర్శించారు
  • అయితే చంద్రబాబుపై విమర్శలను సాక్షి చూపలేదు
  • ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మెగాబ్రదర్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ సీఎం చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్ లను విమర్శించారని, అయితే చంద్రబాబుపై పవన్ చేసిన విమర్శలను సాక్షి మీడియా పక్కన పెట్టేసిందని మెగాబ్రదర్ నాగబాబు విమర్శించారు. కేవలం జగన్ పై పవన్ కల్యాణ్ చేసిన విమర్శలనే ప్రధానంగా చూపిందని మండిపడ్డారు. పవన్ కల్యాణ్ చంద్రబాబును, లోకేశ్ ను, జగన్ ను సమానంగా విమర్శించారని చెప్పారు. హైదరాబాద్ లో ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగబాబు మాట్లాడారు.

చిరంజీవి టికెట్లు అమ్ముకున్నారని గతంలో ఏబీఎన్, టీవీ9 ఛానళ్లు తప్పుడు కథనాలు రాశాయని నాగబాబు మండిపడ్డారు. ఇప్పుడు సాక్షి టీవీ, ఛానల్ కూడా పవన్ కల్యాణ్ విషయంలో అదే చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, ఇప్పుడు తాము మీడియాకు భయపడబోమని స్పష్టం చేశారు. ఓ 5-6 సంవత్సరాల క్రితమే మీడియా విశ్వసనీయత కోల్పోయిందని వ్యాఖ్యానించారు. ఏ కులంలోనూ అందరూ చెడ్డవాళ్లు లేదా అందరూ మంచివాళ్లు ఉండరని నాగబాబు అభిప్రాయపడ్డారు. అయితే ఆయా కులాలలోని నాయకుల వల్ల మొత్తం కులానికి చెడ్డపేరు వస్తుందని చెప్పారు. నాగబాబు నరసాపురం లోక్ సభ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన సంగతి తెలిసిందే.

More Telugu News