Congress: కాంగ్రెస్‌ నేత వీహెచ్ అలక... పార్టీ సమావేశం నుంచి మధ్యలోనే నిష్క్రమణ

  • పార్టీ నేతల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన వీహెచ్‌
  • ఎమ్మెల్యేలు పార్టీ మారుతారన్నప్పుడే పిలిచి మాట్లాడిల్సిందని సూచన
  • సీఎల్పీ భట్టివిక్రమార్క ఒక్కడే పర్యటించి ఏం సాధిస్తాడని ప్రశ్న

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ ఎంపీ వి.హనుమంతరావు పార్టీ నేతల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ఎమ్మెల్యేల ఫిరాయింపు, ఇతరత్రా అంశాలపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు జరిగిన సమావేశం నుంచి ఆయన ఆగ్రహంతో మధ్యలోనే వెళ్లిపోయారు.

 సమావేశం ప్రారంభం కాగానే పార్టీ నేతల తీరుపై వీహెచ్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీలో ఉన్న వారికి విలువలేకుండా చేసి బయట వారిని తెచ్చి పెద్దరికం అప్పగించారని, అటువంటి వారిని నమ్ముకుని ఏళ్ల తరబడి పార్టీలో ఉన్న వారికి ఏం సమాచారం ఇవ్వాలనుకున్నారని ప్రశ్నించారు.

‘ఎమ్మెల్యేలు పార్టీ వీడుతున్నారని తెలిసి కూడా వారిని పిలిచి మాట్లాడలేకపోయారు. తీరా ఇప్పుడు వెళ్లిపోయాక పిలిచి ఏం మాట్లాడుతారు’ అని వీహెచ్‌ ప్రశ్నించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో పర్యటిస్తున్న సీఎల్పీ నేత భట్టివిక్రమార్క ఒక్కడే ఏం సాధిస్తారో చెప్పాలని కోరారు. పార్టీ కోసం మేమంతా లేమనుకున్నారా? అని అసంతృప్తి వ్యక్తం చేస్తూ మధ్యలోనే వెళ్లిపోయారు.

More Telugu News