Andhra Pradesh: సినిమాల్లోకి పవన్ కల్యాణ్ రీ-ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన నాగబాబు!

  • చిరంజీవి కంటే పవన్ కు ప్రజలే ముఖ్యం
  • ఆయన్ను అణచివేస్తే 100 రెట్లు పైకి లేస్తాడు
  • ఓ టీవీ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన నాగబాబు

మెగాస్టార్ చిరంజీవి కేంద్ర మంత్రిగా పనిచేసినప్పటికీ ఆయనపై ఓ చిన్న అవినీతి ఆరోపణ కూడా లేదని మెగాబ్రదర్, జనసేన నేత నాగబాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ విభజన చేపట్టవద్దని చిరంజీవి చాలా గట్టిగా నిలబడ్డారని గుర్తుచేశారు. ఏపీ విభజన జరిగాక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న విశ్వసనీయత పూర్తిగా పోయిందన్నారు. అన్నయ్య కంటే ప్రజలే ముఖ్యమని పవన్ కల్యాణ్ భావిస్తారని చెప్పారు. హైదరాబాద్ లో ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగబాబు పలు అంశాలపై మాట్లాడారు.

2009లో ప్రజారాజ్యం తరఫున ఓటమిని ఫేస్ చేశామని నాగబాబు తెలిపారు. అప్పుడు తమ సన్నద్ధతకు, ఇప్పుడున్న సన్నద్ధతకు తేడా స్పష్టంగా ఉందన్నారు. ఈసారి జనసేనకు ఓటేయాలన్న భావన ప్రజల్లో బలంగా కనిపించిందని అభిప్రాయపడ్డారు. ‘పవన్ కల్యాణ్ ఎన్నికల తర్వాత సినిమాల్లోకి వెళతారా?’ అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. కొందరు పవన్ కల్యాణ్ ను డీగ్రేడ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

అందులో భాగంగానే ఇలాంటి వదంతులను వ్యాప్తి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కల్యాణ్ బాబును ముట్టుకోకుండా ఉంటేనే మంచిది సార్. ఎవరైనా అణచివేయాలనుకుంటే 100 రెట్లు పైకి లేస్తాడు’ అని తెలిపారు. పవన్ కల్యాణ్ ను ఎవరు విమర్శించినా అది ఆయనకు ప్లస్ అవుతుందని స్పష్టం చేశారు. తాను రాజకీయాల్లోనే కొనసాగుతాననీ, సినిమా చేయనని పవన్ కల్యాణ్ గతంలోనే చెప్పారని నాగబాబు గుర్తుచేశారు.

ఒకవేళ సినిమాలు చేయాలనుకుంటే రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం లేదన్నారు. ఎన్టీఆర్, జమున, చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలు చేశారనీ, పవన్ కల్యాణ్ అలా చేయాలని రూల్ ఏముందని ప్రశ్నించారు.

More Telugu News