visakha railway zone: విశాఖ రైల్వే జోన్‌ ఏర్పాటుకు కసరత్తు మొదలు... డివిజన్లలో పర్యటిస్తున్న ప్రత్యేకాధికారి శ్రీనివాస్‌

  • అధికారులు, ఉద్యోగులతో వరుస భేటీలు
  • సెప్టెంబరులోగా జోన్‌పై నివేదిక ఇచ్చేందుకు ఏర్పాట్లు
  • ఇప్పటికే బోర్డు చైర్మన్‌తోనూ భేటీ అయి చర్చలు

విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేయనున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ఏర్పాటుకు అవసరమైన విధి విధానాల రూపకల్పనకు కసరత్తు మొదలయ్యింది. ఇందుకోసం నియమితులైన ప్రత్యేక అధికారి ఎస్‌.ఎస్‌.శ్రీనివాస్‌ అన్ని డివిజన్లలో పర్యటిస్తూ ఉద్యోగులు, అధికారులతో భేటీ అవుతున్నారు. ఇప్పటికే తూర్పు కోస్తా రైల్వే కేంద్ర కార్యాలయం, సికింద్రాబాద్‌లోని దక్షిణ మధ్య రైల్వే కేంద్ర కార్యాలయాన్ని సందర్శించి అక్కడి అధికారులతో భేటీ అయ్యారు. విజయవాడ సమీపంలోని రాయనపాడు వర్క్‌షాప్‌ను సందర్శించి అక్కడి ఉద్యోగుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. గుంతకల్‌ డివిజన్‌ తిరుపతి వర్క్‌షాప్‌ను కూడా సందర్శించాలని నిర్ణయించారు. ఇటీవలే రైల్వే బోర్డు వినోద్‌కుమార్‌ యాదవ్‌ను కలిసి పలు అంశాలపై చర్చించారు. ఐదు నెలల్లోగా నివేదిక రూపొందించేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్న ఆయన సూచన మేరకే శ్రీనివాస్‌ వివరాల సేకరణ వేగవంతం చేసినట్లు భావిస్తున్నారు.

ప్రధానంగా వాల్తేరు డివిజన్‌ను రెండుగా విభజించాల్సి ఉండడంతో పరిధి నిర్ణయం పెద్ద సవాలని చెప్పాలి. రెండు రాష్ట్రాల పరిధిలో ఈ జోన్‌ ఉండడంతో ఈ డివిజన్‌ను విశాఖ, రాయగడ డివిజన్లుగా ఏర్పాటు చేయనున్నారు. అయితే సరిహద్దు విషయంలో ఎలా నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తి రేకెత్తిస్తోంది. జోన్‌ కేంద్ర కార్యాలయాన్ని దువ్వాడలో ఏర్పాటు చేయాలన్న యోచన నేపథ్యంలో అక్కడి సదుపాయాలు, అందుబాటులో ఉన్న రవాణా తదితర అంశాలను పరిశీలిస్తున్నారు.

రెండు జోన్ల విభజన ద్వారా మూడో జోన్‌ ఏర్పాటవుతుండడంతో విమర్శలకు తావులేని విభజన ప్రక్రియకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. మొత్తం ప్రక్రియను సెప్టెంబరులోగా పూర్తి చేసి ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చేలా ప్రత్యేక అధికారి కృషి చేస్తున్నారు.

More Telugu News