Telangana: ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సు ఆధ్వర్యంలో డెలివరీ.. పురిట్లోనే బిడ్డ మృతి!

  • డాక్టర్ లేకపోవడంతో నార్మల్ డెలివరీకి ప్రయత్నం
  • తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో ఘటన
  • డీహెచ్ఎంవో ఆధ్వర్యంలో విచారణ కమిటీ ఏర్పాటు

తొమ్మిది నెలల పాటు చిన్నారిని మోసిన ఆ తల్లికి ఆసుపత్రి సిబ్బంది కడుపుకోతను మిగిల్చారు. డాక్టర్ లేకపోవడంతో నార్మల్ డెలివరీ చేయించబోయారు. అయితే ఈ వైద్యం వికటించి పిల్లాడు పురిట్లోనే చనిపోయాడు. తెలంగాణలోని నిజామాబాద్ లో నిన్న రాత్రి చోటుచేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

నిజామాబాద్ జిల్లాలోని కమ్మర్ పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో నిన్న రేణుక అనే మహిళ మూడో కాన్పు కోసం చేరింది. ఈ నేపథ్యంలో ఆమెకు నొప్పులు ప్రారంభమయ్యాయి. అయితే డాక్టర్ అంబికా రెండ్రోజులుగా అందుబాటులో లేకపోవడంతో నర్సు జ్యోతి తాను డెలివరీ చేయిస్తానని చెప్పింది. అనంతరం నార్మల్ డెలివరీ పూర్తయ్యాక కొద్దిసేపటికే బాలుడు చనిపోయాడు. అయితే ఈ విషయాన్ని జ్యోతి దాచిపెట్టింది. చిన్నారి ఆరోగ్యం బాగోలేదనీ, పక్కనే ఉన్న మెట్ పల్లిలోని మరో ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించింది.

బాబును మెట్ పల్లిలోని ఆసుపత్రికి తీసుకెళ్లగా, అప్పటికే బాలుడు చనిపోయినట్లు అక్కడి వైద్యులు నిర్ధారించారు. డెలివరీ సందర్భంగా జరిగిన పొరపాటు కారణంగానే ఈ ఘటన చోటుచేసుకుందని తేల్చిచెప్పారు. దీంతో బాధిత కుటుంబం కమ్మర్ పల్లిలోని ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయం మీడియాలో రావడంతో జిల్లా ఉన్నతాధికారులు విచారణ కోసం డీహెచ్ఎంవో ఆధ్వర్యంలో ఓ కమిటీని ఏర్పాటుచేశారు.

More Telugu News