Crime News: కుటుంబ కలహాలు.. ఆవేశంలో తండ్రిని హత్య చేసిన తనయ

  • విశాఖ నగరం కంచరపాలెంలో అర్ధరాత్రి ఘటన
  • వేరొక మహిళతో తండ్రి సహజీవనం చేయడంతో కలతలు
  • వివాదం సందర్భంగా చాకుతో తండ్రి, అతని ప్రియురాలిపై దాడి

మరో మహిళ మోజులో పడి తమను, తమ తల్లిని నిర్లక్ష్యం చేస్తున్న తండ్రిపై, అతని ప్రియురాలిపై ఆగ్రహంతో కుమార్తె దాడిచేసిన ఘటనలో అతను అక్కడికక్కడే చనిపోయాడు. ప్రియురాలు తీవ్రంగా గాయపడింది. విశాఖ నగరం కంచరపాలెం పరిధి రవీంద్రనగర్‌లో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది.

కంచరపాలెం పోలీసుల కథనం మేరకు... ఏజెన్సీ ప్రాంతానికి చెందిన కుడా సముద్రయ్య (48) విశాఖ రైల్వే డీజిల్‌ లోకోషెడ్‌లో ఉద్యోగి. 1995లో నాగలక్ష్మితో ఇతనికి పెళ్లికాగా కుమార్తె, కొడుకు ఉన్నారు. గత కొన్నాళ్లుగా సముద్రయ్య కుటుంబంతో కలిసి రవీంద్రనగర్‌లో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో భర్తతో విడిపోయి వేరు కాపురం ఉంటున్న ఎస్‌.రమణమ్మ అనే మహిళతో సముద్రయ్యకు వివాహేతర సంబంధం ఏర్పడింది. మరో ఇల్లు తీసుకుని సముద్రయ్య ఆమెతో వేరు కాపురం మొదలు పెట్టాడు.

రమణమ్మ మోజులో పడిన సముద్రయ్య మొదటి భార్య, పిల్లల్ని నిర్లక్ష్యం చేయడంతో కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. చివరికి వివాదం కుల పెద్దల పంచాయతీ వరకు వెళ్లింది. పెద్దల తీర్పు మేరకు అందరూ కలిసి ఉండేందుకు అంగీకారం కుదింది. దీంతో గత కొన్ని రోజులుగా సముద్రయ్య మొదటి భార్య నాగలక్ష్మి, ఆమె పిల్లలు, ప్రియురాలు రమణమ్మతో కలిసి ఊర్వశి జంక్షన్‌ ప్రాంతంలో ఒకే ఇంట్లో నివాసం ఉంటున్నాడు.

ఈ నేపథ్యంలో సముద్రయ్య మొదటి భార్య నాగక్ష్మి రెండురోజుల క్రితం  కొన్ని చీరలు కొని వాటిని పేదలకు పంచిపెట్టాలని నిర్ణయించింది. డ్వాక్రా సభ్యురాలైన నాగలక్ష్మి డ్వాక్రా నిధులతో వీటిని కొలుగోలు చేసింది. అయితే తన భార్య నాగక్ష్మికి వేరెవరితోనో వివాహేతర సంబంధం ఉందన్న అనుమానం ఉన్న సముద్రయ్య, అతడిచ్చిన డబ్బుతోనే భార్య వస్త్రాలు కొని ఉంటుందని భావించాడు. ఇదే విషయమై గురువారం రాత్రి 10.30 గంటల సమయంలో భార్యను నిలదీశాడు.

ఈ వివాదం కాస్తా పెద్దదయ్యింది. ఈ సమయంలో తండ్రి తీరుతో ఆగ్రహానికి గురైన సముద్రయ్య కుమార్తె (ఆంధ్రవిశ్వవిద్యాయంలో ఇంజనీరింగ్‌ చదువుతోంది) బిబాష  వంట గదిలో ఉన్న చాకుతో తండ్రిపై దాడి చేసింది. అడ్డుకున్న అతని ప్రియురాలిపైనా దాడికి పాల్పడింది. కత్తి సముద్రయ్య గొంతులో దిగడంతో అతను అక్కడికక్కడే చనిపోగా, అతని ప్రియురాలు రమణమ్మ తీవ్రంగా గాయపడింది.

 సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని నిందితులు బిబాషా, ఆమె తల్లి నాగలక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన రమణమ్మను ఆస్పత్రికి తరలించారు.

More Telugu News