TV9: నన్నెవరూ అరెస్ట్ చేయలేదు.. చేయబోవట్లేదు: ‘టీవీ 9’ సీఈఓ రవి ప్రకాశ్

  • కొంతమంది తప్పుడు ఆరోపణలకు యత్నించారు
  • నాపై ఎవరికి తోచినట్టు వారు వార్తలు ప్రసారం చేశారు
  • బాధ్యతాయుతంగా సరైన వార్తలను చూపిస్తే బాగుండేది 

ప్రముఖ మీడియా సంస్థ ‘టీవీ 9’ సీఈవో పదవి నుంచి రవిప్రకాశ్ ను తొలగించారని, అరెస్టు చేశారని, చేయబోతున్నారంటూ వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. ఈ నేపథ్యంలో ఈరోజు రాత్రి ‘టీవీ 9’ స్డూడియోలో ఆయన లైవ్ ప్రోగ్రాంలో మాట్లాడారు.

‘రవిప్రకాశ్ ను ఎవరూ అరెస్ట్ చేయలేదు, చేయబోవట్లేదు. కొంతమంది తప్పుడు ఆరోపణలు పెట్టడానికి ప్రయత్నించారు. ‘‘నిజం’ చెప్పులు వేసుకునేలోగా ‘అబద్ధం’ ప్రపంచం చుట్టూ తిరిగొస్తుంది’. ఈరోజు అదే జరిగింది. జర్నలిజం విలువల కోసం ఎప్పుడూ నిలబడ్డాం. భవిష్యత్తులోనూ నిలబడతాం. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ గందరగోళాన్ని కాస్త తగ్గించేందుకే మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను’

భవిష్యత్ లోనైనా క్రెడిబుల్ న్యూస్ ఇస్తారని ఆశిస్తున్నా

‘రవి ప్రకాశ్ రెండు రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. రవి ప్రకాశ్ కోసం పోలీసులు వెతుకుతున్నారు. రవి ప్రకాశ్ తప్పించుకుని తిరుగుతున్నారు. రవి ప్రకాశ్ ఎవరి సంతకాన్నో ఫోర్జరీ చేశారు. రవి ప్రకాశ్ ‘టీవీ9’ నుంచి వేరే ఛానల్ కు నిధులు మళ్లించారు’ అంటూ ఇలా ఎవరికి తోచిన విధంగా వారు వార్తలను ప్రసారం చేయడం, స్క్రోలింగ్ లు నడపడం చేస్తున్నారు. నా పట్ల ఇంత కన్సర్న్ ఉన్న సాటి ఛానెళ్లకు ధన్యవాదాలు’ అంటూ సెటైర్లు విసిరారు. ఈరోజు ఉదయం నుంచి తప్పుడు వార్తలు ప్రసారం చేసిన వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నానంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘మీరు కొద్దిగా బాధ్యతాయుతంగా సరైన వార్తలను చూపించి ఉంటే బాగుండేది. భవిష్యత్ లోనైనా క్రెడిబుల్ న్యూస్ ఇస్తారని ఆశిస్తున్నాను’ అని ఆయా ఛానెళ్లకు రవిప్రకాశ్ సూచించారు.

More Telugu News