Gambhir: తనకు వ్యతిరేకంగా పంచిపెట్టిన కరపత్రాలను చదువుతూ కన్నీళ్లు ఆపుకోలేకపోయిన ఆప్ అభ్యర్థి

  • గంభీర్ పై ఆరోపణలు
  • అతిషికి ఆప్ నేతల సంఘీభావం
  • ఆమ్ ఆద్మీ నేతలకు బదులిచ్చిన గంభీర్

ఇటీవల బీజేపీలో చేరిన క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఢిల్లీ నార్త్ లోక్ సభ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీచేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున పోటీచేస్తున్న అతిషి మార్లేనాతో గంభీర్ కొన్నిరోజులుగా అమీతుమీ అంటున్నారు. ఈ నేపథ్యంలో, తన గురించి అభ్యంతరకరమైన రీతిలో గంభీర్ లక్షల కరపత్రాలు ముద్రించి అందరికీ పంచిపెడుతున్నాడని అతిషి ఆరోపించారు. అంతేకాదు, మీడియా సమావేశంలో ఆ కరపత్రంలో ఉన్న అంశాలను చదువుతూ అతిషి కన్నీటి పర్యంతం అయ్యారు.

గంభీర్ లాంటి వ్యక్తి ఎంపీగా వస్తే మహిళల పరిస్థితి ఎలా ఉంటుందో ఈ కరపత్రమే చెబుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఆప్ సీనియర్ నేత మనీశ్ సిసోడియా తీవ్రస్థాయిలో స్పందించారు. గంభీర్ ఈ స్థాయికి దిగజారతారని తాము ఊహించలేకపోతున్నామని అన్నారు. దీనిపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందిస్తూ ట్వీట్ చేశారు. ఇలాంటి వ్యతిరేక శక్తులను అతిషి ధైర్యంగా ఎదుర్కోవాలంటూ పిలుపునిచ్చారు. ఆ వెంటనే గంభీర్ ఘాటుగా బదులిచ్చారు.

ఎన్నికల్లో గెలిచేందుకు ఏ మార్గం దొరక్క ఓ మహిళ కన్నీటిపై ఆధారపడుతున్నారంటూ కేజ్రీవాల్ పై విమర్శ చేశారు. అయితే, ఆ కరపత్రాలు పంచింది తాను కాదని, తానే ఆ కరపత్రాలు పంచినట్టు రుజువు చేస్తే పోటీ నుంచి తప్పుకుంటానని గంభీర్ స్పష్టం చేశారు.

More Telugu News