Andhra Pradesh: ఏపీ ప్రభుత్వానికి తాత్కాలిక ఊరట.. రూ.100 కోట్ల జరిమానాపై స్టే విధించిన సుప్రీంకోర్టు!

  • కృష్ణా నదిలో ఇసుక అక్రమ తవ్వకాలు
  • సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం
  • 3 నెలల పాటు స్టే విధించిన అత్యున్నత న్యాయస్థానం

జాతీయ హరిత ట్రైబ్యునల్(ఎన్జీటీ) రూ.100 కోట్ల జరిమానా విధించడంపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఎన్జీటీ ఆదేశాలను నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని కోరింది. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వ న్యాయవాది గంగూలీ వాదిస్తూ.. ఇద్దరు వ్యక్తులు దాఖలు చేసిన కేసును సుమోటోగా స్వీకరించిన ఎన్జీటీ విచారణ జరిపిందని తెలిపారు.

ఏపీ ప్రభుత్వానికి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే ఈ విషయంలో ట్రైబ్యునల్ తుది నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. వాదనలు విన్న జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఎన్జీటీ ఆదేశాలపై మూడు నెలల పాటు స్టే విధించింది. ఈ విషయంలో రెండు నెలల్లోగా తమ స్పందనను తెలియజేయడంతో పాటు వాదనలు వినిపించాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

కృష్ణా నదిలో ఇసుక అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయని వాటర్ మేన్ రాజేంద్ర సింగ్, అనుమోలు గాంధీలు నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ను ఆశ్రయించారు. ప్రతిరోజు 2,500 ట్రక్కుల్లో 25 మీటర్ల లోతు వరకు నదిలో ఇసుకను అక్రమంగా తవ్వుతున్నారని ఆరోపించారు. దీన్ని విచారించిన ఎన్జీటీ.. ఏపీ ప్రభుత్వానికి ఏకంగా 100 కోట్ల రూపాయల జరిమానా విధించింది.

More Telugu News